సౌజన్యం: శ్రీమతి వై. రమాప్రభ, ప్రిన్సిపాల్, ఆంధ్రమహిళాసభ కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మీడియా ఎడ్యుకేషన్
భగవదవతారములు స్థూలముగా పది అని చెప్పిననూ అవి అనంతములే! సంభావిత దశావతారము లందు శ్రీరామ - శ్రీకృష్ణాద్యవతారములు విశేషమైనవి. అవి విభవావతారములు. ఈ రెంటి యందు రామకృష్ణాదులు మానవావతారులుగా నుండి లోక కల్యాణకరములైన దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసిరి. ఆ విధముగా మానవ సౌజాత్యముతో స్నేహ సంబంధములతోడి దగ్గరగాచేరి శాంతి స్థాపన చేసిరి. ప్రకృతము కృష్ణ అవతారము యొక్క ప్రభావమును వాగ్గేయకారులు అనుభవించిన తీరుతెన్నుల ప్రస్తావింతము.
సంస్కృత భాషలో ప్రతి అక్షరమునకు అనేకార్థములన్నవి. అర్థవంతమైన అక్షర సముదాయము పదము - తదాది వాక్యనిర్మాణమగుచున్నది. కృష్ణ- ణ అనుటలో వ్యవసాయత్మితక (పరిశ్రమ) బుద్ధిగలవాడని ఒక అర్థము. ఏమావ్యవసాయము? లోకజన సౌలభ్యుడై ''కంటకుల'' నుండి సజ్జనుల రక్షించుట - దుర్మతిని నిర్మూలించుట - సత్యా సత్య - నిత్యానిత్య వివేచనతో లోక జాగృతికై శ్రమించుట కృష్ణ శబ్దమునకు నికరమైన అర్థము. జగదాచార్యునిగా అర్జనుని నిమిత్తముంచుకొని స్వామి 'గీత బోధించిరి.' అంత్యకాలము వరకు భగవద్విభూతిని నిండుగ అనుభవించిన వ్యక్తి పరమపదము చేరును. అందుకై ప్రతిఫలాపేక్షరహిత కర్మనాచరించుట విధిగా చెప్పిరి- ఇట్టి నిరపాయకరమైన భావనతో భగవచ్చింతన చేసిన గానధౌరేయులగు మన భారతీయ వాగ్గేయకారులు అనంత గేయ సంపదను మన కందించిరి. ఏతద్గానమే ముక్తి నిదానమగును.
''నాహం వసామి వైకుంఠే నయోగిహృదయేరవే
మద్భక్తాయత్రగాయన్తి తత్రతిష్ఠామి నారద''
అను ప్రమాణరాత్యా మన వాగ్గేయకారులు నారద - వాల్మీకాదుల తీరున తమ గేయధారలలో భగవద్విభూతిని రసవంతముగా అనుష్ఠించారు మార్గదర్శులైనారు.
జయదేవ - సూరదాసు - చైతన్య మహాప్రభు - మీరాబాయి ఔత్తరాహులుకాగా దక్షిణాత్యులైన ఆళ్వారులు - తీర్థనారాయణ, క్షేత్రజ్ఞ, త్యాగరాజు - దీక్షిత, పాపనాశం శివన్ గారలు తమ గాన భక్తి సుమములతో అనుభూతిని పంచిరి. మచ్చునకు కొన్ని ఆ పద్య గేయగాన ఫణితుల తాళత్తళల సమీక్షించుకొందాము.
తరుణారుణ కరుణామయ విపులాయుత నయనం
కమలాకుచ కలశీభృత విపులీకృత పులకం
మురళీరవ తరళీకృత మునిమా స నళినం
మమఖేలతి మద చేతసి మధురాధర మమృతం !!
ఇందులోని శబ్దజాలములో పదముల రుచి పొందిన కృష్ణ సాక్షాత్కారం చేయిస్తుంది. శ్రీ నారాయణ తీర్థుల రచనలలోనూ పద సంయోజన రుచి ఆస్వాదించవచ్చు. మాధవ మామవ దేవా - యాదవ శేఖర యదుకుల కృష్ణా.
సాధుజనాధార ! సర్వభావ ! మాధవమామవదేవా!
అంబుజలోచన ! కంబుశుభగ్రీవ ! బింబాధరా చంద్రబింబాసనా
చాంపేయనాసాగ్ర ! లగ్నసుమోక్తి ! శారదచంద్ర జనితమదనా!
లక్షణమైన పదముల ఘటింపు మనోమయ చిత్రాన్నిస్తున్నది. స్తుతిపూర్వక సాహిత్యం-
''ముకుందమాల'' రచయిత కులశేఖరులు కూడా నిరామయం 'కృష్ణరసాయనం పిబ' అనడంలో అతీతమైన నామానుసంధాన ప్రక్రియ - అన్వయలాభం విష్ణుపదమే అని సూత్రీకరిస్తున్నది - అంతేకాదు,
'కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాంత
అదైవ్తమే విశతు మానస రాజహంస
ప్రాణ ప్రయాణ సమయే 'కపవాతపి'త్తై
కంఠావరోదనవిధౌ స్మరణం కుతస్తే!
అవసాన సమయంలో నామస్మరణకు శరీరావయవాలు సహకరించవు కదా! ఇపుడే మానసికంగా నిన్ను కొలిచే 'విధి'ని పాలిస్తానంటారు కులశేఖరులు - అంటే ''విష్ణుపదం'' నామానుసంధానంతో వస్తుందని ఘంటాపథంగా చెప్తున్నారు - నేటికి గానసభలలో 'ముకుందమాల' శ్లోకాలు గాయకులు కోరి పాడుతారు.
క్షేత్రజ్ఞులు తక్కువేంకాదు! మేరగాదు రమ్మన వేనాసామిని మోరతోపుసేయక! మువ్వగోపాలస్వామిని! అని సామిని ఆహ్వానిస్తున్నది విరహోత్కంఠిత నాయిక. ''గమకించి మోవిపంట గంటి చేసితినని రమణి! మువ్వగోపాలుడు రాక పరాకుజేసెనే'' అంటున్నది ''మేలు వాడననె నిను బాసి తాళజాలనే'' అని మరొక పదమున పాడినది - ఎంతటి విరహమో?
అన్నమాచార్యుని తరహా ఇంకా చిత్రము. బాలకృష్ణునే ఊయల లూచేపాట - చ్యుతములోనిది అచ్యుతము ఆ అచ్యుతునికై కైమోడ్పు.
జోఅచ్చుతానంద జోజో ముకుందా
రార! పరమానంద రామగోవిందా!
నుందునింటను జేరి నయముమీరంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
అందమున వారిండ్ల ఆడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ !!
ఏమి సరళమైన 'రంగ' రాణ్వైభవమోకదా!
'కర్ణాటక సంగీత పితామహుడు'' మరొక తీరున లాలిస్తున్నాడు స్వామిని-
''జగదోద్ధారన అడిసిదళెశోదె
జగదోద్ధారన మగనెందు తిళియుత
మగుగళ మాణిక్యన అడిశిడళెశోదె
ఆణోరణీయన మహతోమహీయన
అప్రమేయన అడిశిదళెశోదే''
ఈ పదాలలో భావన రసావిష్కారము చేస్తుంది - అంతర్లీనంగా బ్రహ్మజిజ్ఞాస భావనద్యోతకమౌతున్నది. త్యాగయ్యగారైతే - ''రామ'' స్పర్శనే అనుభవించినా అక్కడక్కడ కృష్ణానుభవాన్ని రమ్యంగా వెలిబుచ్చారు - గానకవితా సరస్వతి విహరించిందాయన మదిలో-
''గానమూర్తే! శ్రీకృష్ణవేణు
గానలోల త్రిభువనపాలా
మానినీమణి శ్రీ రుక్మిణి మానసాపహార
మారజనక దివ్యా
నవనీత చోర - నంద నత్కిశోర - సరమిత్రధీర నారసింహశూర
నవమేఘతేజ - నగజాసహజ
నరకాంతక - అజ త్యాగరాజనుత !!
గానమూర్తి రాగంలో విలక్షణ శుద్ధమైన రుచిగల పదాల కూర్పు చేశారు త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులవారు 'హిందోళ' రాగములో లాలిత్యపూర్ణంగా-
''గోవర్థన గిరీశం స్మరామి అనిశం
గోపికాది మనోహరం - గర్విత కంసాది హరం
గోవిందనామసారం - గజేంద్ర రక్షణ ధరం
కవిజన హృన్మందారం - కనకజిత సుశరీరం
రవిశశినయన విలాసం రమణీయ ముభాభాసం
శివగణాది విశ్వాసం శ్రీ గరుగుహమనోల్లాసం !!''
ఇలా రసభరిత భావగర్భిత హృదయోత్తుంగ తరంగ పద సంపుటితో వాగ్గేయ శ్రీమంతులు ఎన్నో శ్రీకృష్ణ సంస్పర్శగల రుచిమయ రచనలు వెలయించి 'నామసామ్రాజ్యభావ హృదయంపై విరాజిల్లినారు - 'శ్రీకృష్ణం ధర్మం సనాతనం'' దానిని మృదుపద ఘట్టములు చిరుమువ్వల సవ్వళులవలె రసికులనూ అలరిస్తున్నాయి - ఇంకా ఆస్వాద యోగ్యంగా కృతుల సాహిత్యాన్ని చవిచూస్తే అనుభవనీయమౌతుంది.