సుగుణా వాళ్ళాయనకి కొత్తగా బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. అంతవరకు బెంగుళూరు చూడలేదు సుగుణ. ముందుగానే ఇల్లు చూసుకొని సుగుణని తీసుకొచ్చాడు సుగుణ భర్త. చక్కటి మూడు గదుల ఇల్లు. ఇంటి ముందు కుర్చి వేసుకొని కూర్చోడానికి స్థలము ఉంది. ఇంటికి కొంచం దూరంలోనే కిరాణా కొట్లు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల చాలా ఇళ్ళే ఉన్నాయి. బయటకు వెళ్ళి కొనుకునే అవసరం లేకుండా వీధిలో కూరగాయల తోపుడుబండ్లు చాలానే వస్తూ ఉంటాయి. ఇల్లు సర్ధుకోడానికి నాలుగు రోజులు పట్టింది సుగుణకి. సాయంత్రం ఇంటి ముందరకి వచ్చి నిలబడింది సుగుణ, అటు పక్క నుండి ఒక పన్నెండేళ్ళ కుర్రాడు వచ్చి " అక్కా! పూలు కావాలా? కొత్తగా ఇంటికి వచ్చారుగా గడపకి కట్టుకో అక్కా! " అని వరుస కలిపి పలకరించాడు. వాడిని చూడగానే ముచ్చటేసింది సుగుణ కి. నాలుగు మూరలు పూలు కొంది వాడి దగ్గర.
ఇంటి ప్రతీ గుమ్మానికి పూలు అలంకరించింది సుగుణ. ఆ వాసనకి ఇల్లు అంతా ఒక రకమైన పవిత్రత అలముకున్నట్టయ్యింది. మళ్ళీ రెండు మూడు రోజులయ్యాక సాయంత్రం ఆరు ఆరున్నర మధ్యలో వచ్చాడు ఆ పిల్లాడు "అక్కా ! పూలు కావాలా? " అంటూ..
" నిన్న మొన్న ఎందుకు రాలేదు? " అని అడిగింది సుగుణ.
" అక్కా! మా అమ్మ పూలు అమ్ముకుంటుంది, అవి అమ్ముడవ్వని రోజుల్లో అమ్ముతాను " అని జవాబు చెప్పాడు.
" స్కూల్ కి వెళ్తునావా? " అని అడిగింది సుగుణ
" ఆ వెళ్తున్నాను అక్కా! అందుకే ఈ టైం లో వచ్చి పూలు అమ్ముతాను అక్కా , రోజు మా అమ్మ అందరి ఇంటికి వెళ్ళి అమ్మి వచ్చేస్తుంది. మిగిలిన పూలు నేను అమ్ముతాను. " అని చెప్పాడు.
" మీ నాన్న ఏం చేస్తూ ఉంటాడురా? "
" మా నాన్న మేస్త్రీ పని చేస్తాడు, కానీ తాగుడికే సరిపోతుంది అక్క తన జీతం "
"హ్మ్మ్... పోనీలే ఒక రెండు మూరలు పూలు ఇచ్చి వెళ్ళు "
" అక్క నాలుగు మూరలు ఉన్నాయి తీసేసుకోరాదూ! ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతాను చదుకోవాల్సినది చాలా ఉంది అక్కా " అని అన్నాడు ఆ కుర్రాడు.
సుగుణకి జాలి వేసి అన్నీ పూలు తనే జాలి పడి తీసుకుంది.
భర్త ఇంటికి రాగానే ఆ కుర్రాడి విషయం చెప్పింది.
" వాడికి నిండా పన్నెండేళ్లు లేవు.. పాపం పిచ్చి వెధవ.. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడో? తల్లి కష్టం పంచుకోవడం వాడికి ఇప్పటి నుండే తెలిసింది. ఒక పక్క చదువుకుంటూ ఇలా పూలు అమ్ముకుంటున్నాడు. పాపం.. వాడికి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటున్నానండి. కోటి విద్యలు కూటి కొరకే కదా!! ఇంకో అబ్దుల్ కలామ్ అవ్వాలండి వీడు"
అన్నీ విన్న సుగుణ భర్త.. " ఇలాంటి వారు లోకంలో చాలా మందే ఉన్నారు సుగుణ.. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న కాంక్ష చాలా మెండు ఇటువంటి వారి వద్ద. ఏదైన సాయం కావాలంటే చేద్దాంలే మనము " అని ఆ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.
*******
వారానికి ఒకసారో రెండు సార్లో పూలు అమ్మటానికి వస్తూ ఉండేవాడు ఆ కుర్రాడు. అప్పుడప్పుడు వరసగా రెండు మూడు రోజులూ వస్తూ ఉండేవాడు కూడా! ఇలా ఒక నెళ్ళాళ్ళు గడిచాయి. ఒక రోజు
" రోజూ ఈ కాగడా, గులాబీ పూలేనా? చామంతులో, మల్లెల్లో తెస్తే దేవుడికి కూడా పెట్టేద్దాన్ని. నువ్వు తెచ్చినవి కాస్త వాడిపోయినట్టు ఉంటున్నాయి కూడా, చూస్తూ చూస్తు మరునాడు దేవుడికి పెట్టలేకపోతున్నాను. అదేంటి ఆ పూల మాలలో చెంకీ లూ వేసి ఉంటున్నాయి? " అని అడిగింది సుగుణ
" అక్కా! మా దగ్గర హిందూవులే కాదూ అప్పుడప్పుడు ముస్లీంస్ కూడా పూలు తీసుకుంటారు. వాళ్ళకి పూల మధ్యలో చెంకీ వేయాలి. అందుకే.. "
"సరే.. ఒక మూర ఇవ్వు " అని అడిగింది
ఎప్పటి లాగానే వాడి దగ్గర ఉన్న నాలుగు మూరలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
పక్కింటావిడ ప్రతీసారి పూలు తిసుకుంటున్నప్పుడు సుగుణ వైపు చూస్తూ ఉంటుంది. ఈ రోజు మాత్రం పలకరింపుగా నవ్వి వాళ్ళ ఇంటి వైపు కి వచ్చింది. ఆవిడని చూడగానే పూల కుర్రాడు కొంచం ఇబ్బంది పడ్డాడు.
" నమస్తే అండి. నేను మీ పక్కింటిలో ఉంటున్నాను, నా పేరు హేమ. " అని పరిచయం చేసుకుంది.
సుగుణ కూడా తనని తాను పరిచయం చేసుకుంది.
ఇంతలో సుగుణ భర్త ఆఫీస్ నుండి రావడంతో ఆవిడ "మళ్ళొస్తానండి " అని వెళ్ళిపోయింది.
పూల అబ్బాయి కూడా పూలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
మరునాడు సాయంత్రం ఐదు గంటలకే పూలు తీసుకొచ్చి " అక్కా! మేము వేరే ఊరు వెళ్ళిపోతున్నాము, ఇంక రాలేను అక్కా! " అని చెప్పాడు.
సుగుణకి చాలా బాధ అనిపించింది. పర్సులో నుండి వంద రూపాయిలు తీసి " ఏదైనా పుస్తకం కొనుకో " అని ఇచ్చింది. వాడు వెళ్తూ వెళ్తూ " థాంక్స్ అక్కా! " అని వెళ్ళిపోయాడు.
ఇంతలో పక్కింటావిడ వచ్చింది.
"సుగుణ గారు! మీరు ఆ పూల అబ్బాయి దగ్గర పూలు తీసుకోకండి. "
"ఎందుకు? " బ్రుకుటి ముడి వేసి అడిగింది సుగుణ.
" మరేమీ లేదండి.. వాడు పూలు శ్మశానం నుండి శవాల మీద వేసిన పూలు తీసుకొచ్చి అమ్ముతాడు. మన చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. అందుకే ఎవరూ కొనరు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీ దగ్గరకు వచ్చాడు. మీరు వాడి దగ్గర పూలు తీసుకుంటున్నారని ఆ రోజు చూసి ఈ విషయం చెపుద్దామనే మీ దగ్గరకు వచ్చాను, కానీ ఇంతలో మీ వారు రావడంతో ఎందుకు రాద్దాంతం అని చెప్పలేకపోయాను. "
సుగుణ కొంచం ఇబ్బందిగా అనుమానంగా చూసింది హేమ వైపు " నేను చెప్పింది మీకు నమ్మకంగా లేకపోతే రెండు వీధులవతల శ్మశానం ఉంది అక్కడ వీడు, వీడి తోటి వాళ్ళు శవాల మీద పారేసిన పూలు ఏరుకొని ఇలా అమ్ముతూ ఉంటారు, ఎప్పుడేనా మీరు అటు పక్క వెళ్తే చూడవచ్చు, కబుర్లు జాలిగా చెప్పి పూలు అమ్మేస్తూ ఉంటాడు కూడా. "
"అవునండి ఆవిడ చెపుతోంది నిజమే " అని పక్కింటావిడ వత్తాసు పలికింది.
ఇంకా ఆవిడ ఏదో చెప్తోంది.. సుగుణకు ఒళ్లంతా తేళ్ళు జెర్లు పాకుతున్నట్టయ్యింది. " ఇన్ని రోజులు వీడు తెచ్చిన పూలు ఇంటి గుమ్మానికి కట్టానా? దేవుడి ఫటాలకు కూడా వేశాను.. తానూ పెట్టుకున్నాను.. ఛీ..." అని మనసులో అనుకుంటూ బయటకు అనేసింది పరధ్యానంలో...
హేమ, ఆ పక్కింటావిడ సుగుణ పరిస్థితి చూసి రెండు నిమిషాలలో వెళ్ళిపోయారు. సుగుణ ఆ పూలు బయట పారేసి వెళ్ళి తలారా స్నానం చేసింది. భర్త ఇంటికి రాగానే ఈ విషయం చెప్పి " వెధవ.. ఎంత పని చేశాడో చూశారా? అక్క అక్కా అంటూ ఎంత మోసం చేశాడో? పన్నెండేళ్ళు లేవు ఈ వయసులో ఇన్నీ పాడు బుద్ధులా? శవాల మీద వేసిన పూలు నా చేత దేవుడికి పెట్టించాడు.. చెత్త వెధవ.. చెత్త వెధవ! " అంది ఉక్రోషంగా.
అరగంట నుండి సుగుణ అష్టోత్తరం వింటున్న సుగుణ భర్త దీర్ఘంగా నిట్టూర్చి " చూడు సుగుణా.. నువ్వు మోసపోయానన్న విషయం కాసేపు పక్కన పెట్టు, వాడి వైపు నుండి ఆలోచించు .. వాడి కడుపు వాడి చేత ఇవన్నీ చేయించింది. ఆ వయసులో ఇంటికి డబ్బులు తీసుకెళ్ళాలి అనే ఆలోచనే తప్పా వాడికి వేరేది తెలియదు. అమ్మకి డబ్బులు తీసుకొని ఇవ్వాలి. ఆ వయసుకి ఏం కష్టపడతాడు చెప్పు. వాడు నిజంగా ఆ డబ్బులు ఇంటి కోసమే తీసుకెళ్తోంటే రేపు ఎప్పుడేనా ఎక్కడేనా కనపడితే మంచిగా నోటి మాట ద్వారా వాడు చేస్తున్నది తప్పు అని చెప్పి చూద్దాము.. అలా వినకపొతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని బెదిరిద్దాము. వాడు మారి, మరి ఏదైనా మంచి పని చేసుకుంటాడేమో చూద్దాము. ఇక పూల విషయానికి వస్తే అవి ఎక్కడి పూలో తెలియకే నువ్వు దేవుడికి పెట్టావు కదా! నీకేది పాపం అంటదులే. రేపు అర్జంటుగా నాలుగు పూల మొక్కలు తెస్తాను పెరట్లో పాతుకుంద్దాము, ఆ పూలే దేవుడికి పెడద్దాము .. సరేనా.. ఇంక వాడి విషయం వదిలేయ్ " అన్నాడు.
"నిజమే కోటి విద్యలూ కూటి కొరకే కదా " దీర్ఘంగా నిట్టుర్చి అనుకుంది సుగుణ.