కథా భారతి
కాఫీ విత్ కాళిదాసా
- భాస్కర్ కొంపెల్ల

ఈ మధ్య కాళిదాసు ఉన్నట్టుండి కొన్నాళ్ళు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ చక్కా వస్తున్నాడు. ఏదో ‘కాలయాత్ర’ట. అడపాదడపా కొలువులో కనిపిస్తున్నాడుగాని, అదైనా పట్టుమని ఒకటి రెండు రోజులే. ఆ స్థానం అంతా బోసి పోయినట్లుంటోంది. భోజరాజుకేమీ తోచడం లేదు. ఒకరోజు భోజుడికి చాలా చిరాకనిపించి అతణ్ణి నిలదీసాడు.

“మహాకవీ, మీరు ఎక్కడికి పోతున్నారు? ఎలా పోతున్నారు? నాకు తెలియకుండా మన సముద్రతీరాల్లోంచి నావల్లో నా అనుమతి లేకుండా ఎలా వెళ్ళగలుగున్నారు?” అని కోపంగా గద్దించాడు.

కాళిదాసుకి భోజుడు చాలా వాకబులే చేసాడని బోధపడింది. ఒక శ్లోకం చెపితే చల్లబడతాడులే అనుకుని ఇలా అన్నాడు.

సంఙ్ఞాధాతుః బుధజనకృతః పోట్టలీభూతధారా
విద్యుత్కంపైః ప్రకటిత పథః తీవ్రవేగాంతరంగః
అంతర్జాలం రమయతి జనాన్ భిన్నమార్గైరదృష్టైః
ఏతచ్ఛీఘ్రం ఘటయతి సఖౌ రశ్మిరజ్జుప్రబంధైః

(బుధజనకృతః= తెలివైన వారిచే చేయబడ్డదీ; సంఙ్ఞాధాతుః = సంకేతములే మూలవస్తువుగా గలదీ (having software program as basis); పోట్టలీ భూత = పొట్లముల (packets) రూపములో ఉండెడి; ధారా = ప్రవాహమైనదీ; విద్యుత్ కంపైః = విద్యుత్ ప్రకంపనలతో (Electromagnetic waves); ప్రకటిత = ప్రణాళికా రూపమొందిన (manifested); పథః = మార్గము గలదీ; తీవ్ర = ఎక్కువైన; వేగాంతరంగః = వేగమును తనలో గలదీ; అయిన; అంతర్జాలం = Internet ; జనాన్ = ప్రజలను/లోకములను; అదృష్టైః = ముందెన్నడూ చూడబడని; భిన్నమార్గైః = వేర్వేరు త్రోవల్లో; రమయతి = ఆనందింపజేస్తోంది; ఏతత్ = అట్టి (ఈ Internet); రశ్మిరజ్జుప్రబంధైః - రశ్మి = కాంతిసంబంధమైన; రజ్జు = తీగలచే పేనబడిన త్రాళ్ళతో; (with fibre optic cable) ప్రబంధైః = కలుపబడినవానితో (connections); శీఘ్రం = బహువేగముగా ; సఖౌ = ఇద్దరు మిత్రుల్ని, లేదా ప్రేయసీప్రియుల్ని, ఘటయతి = జత కలుపుతుంది. )

భోజురాజుకేమీ అర్ధంకాక అయోమయంగా చూసాడు. అప్పుడు కాళిదాసు రాజుతో “ మహారాజా! మన మానవ జాతి భవిష్యత్తులో కనిపెట్టిన కాలయానం అని ఒకటి ఉంది. భూతకాలంలోకిగాని, భవిష్యత్తులోకిగాని టెలెపోర్టింగ్ అన్న ప్రక్రియవల్ల వెళ్ళచ్చు. అలా వెళ్ళడానికి నావలు అక్కర్లేదు. ఇంటర్నెట్ అనే ఒక గొప్ప సాధనం వాడుకుని, కాంతితీగలద్వారా ఇక్కడ మాయమై భవిష్యత్ లోకి చేరచ్చు. అయితే వాళ్ళే పిలవాలి, వాళ్ళే వెనక్కి పంపాలి కూడా.” అంటూ ఇంటర్నెట్ గొప్పదనమంతా మరోకొన్ని శ్లోకాల రూపంలో చెప్పుకొచ్చాడు.

“ఇదంతా నీకెలా తెలిసింది?” అన్నాడు భోజుడు ఆశ్చర్యపోతూ.

“మహారాజా! నాకు అభిమానులెక్కువని మీకు తెలుసుగదా! రాబోయే కాలంలో కూడా ఇంత గిరాకీ ఉండడంతో వాళ్ళేదో ముచ్చటపడి ఒకసారి పట్టుకుపోయారు. ఇక వాళ్ళతో నాకు బాగా కుదరడం వల్ల మళ్ళీ మళ్ళీ తీసుకుపోతున్నారు” అన్నాడు కాళిదాసు.

“మనిద్దరం విడదీయరాని స్నేహితులం అని వాళ్ళకి తెలియదా? నన్నెందుకు పిలవలేదు?” అన్నాడు రాజు.

రాజరికాలకి కాలం చెల్లిందనీ, భోజుణ్ణి గురించి పట్టించుకునే వాళ్ళు లేరనీ ఎలా చెప్పడం? అందుచేత “ ఈసారి కలిసినప్పుడు కనుక్కుంటాన్లెండి” అన్నాడు తప్పించుకుంటూ.

కొద్దిరోజుల తర్వాత భోజుణ్ణికూడా రమ్మన్నారనీ, తనతో తీసుకెళుతున్నట్టూ విన్నపం చేసాడు కాళిదాసు.

ఒక సుమూర్తంలో ఇద్దరూ భవిష్యత్ లోకి దిగారు.

“మహారాజా! మన బస ఇక్కడ ఏర్పాటయింది” అంటూ ఒక ఇంటికి తీసుకెళ్ళాడు కాళిదాసు. కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసిన తెల్లని వ్యక్తిని (white man) చూసి భోజుడు విస్తుపోయాడు. “ఎవరీ తెల్లాయన? మనం యవనుల ఇంటికి వచ్చామా?” అన్నాడు.

“కాదు కాని అలాంటి జాతివాళ్ళే.. మీరిలాంటి ప్రశ్నలు ప్రాకృతంలో వెయ్యండి. ఈయన పేరు ప్రొఫెసర్ విలియమ్స్. ఇక్కడ విశ్వవిద్యాలయంలో సంస్కృతాచార్యుడు.” అన్నాడు కాళిదాసు భోజరాజు చెవిలో ప్రాకృతంలో . “ఈయనకి సంస్కృతంలో కవిత్వం వ్రాయాలనే ఉత్సాహం కూడా ఉందండోయ్” అన్నాడు రహస్యంగా ముసిముసినవ్వులు నవ్వుతూ.

వాళ్ళు వచ్చింది భారతదేశానికి కాదనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలనే కొత్తదేశానికనీ, ఆ దేశం గురించి భూతకాలంలో భారతఖండానికీ, ఆ చుట్టుపక్కల రాజ్యాలకీ తెలియదనీ చెప్పాడు కాళిదాసు. అక్కడే బల్లమీద ఉన్న గ్లోబ్ తిప్పుతూ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నదీ చూపించాడు. అమెరికాని గురించి వర్ణించి చెప్పాడు కూడా. వాళ్ళిద్దరూ క్రీస్తు పూర్వం వాళ్ళే ఐనా, గ్లోబ్ గుండ్రగా ఉండడం చూసి ఆశ్చర్యపడకపోవడం చూస్తే తెల్లాయనకి గొప్ప ఆశ్చర్యం వేసింది.

వాళ్ళ ఊళ్ళో ఉన్న పేరుమోసిన ఇటాలియన్ రెస్టారెంట్‍కి కాఫీ తాగడానికి బయల్దేరదీసాడు తెల్లాయన.

హైవే మీద శరవేగంగా పోతున్నారు. కార్లో కూర్చున్నప్పటినుంచీ తెల్లాయన మనసు ఏదో ఉద్వేగానికి గురి అవుతోంది. పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆగి ఆగి రియర్ వ్యూ మిర్రర్ లో వెనక సీట్లో కూర్చున్న భోజుణ్ణి చూస్తున్నాడు.

ఉన్నట్టుండి భోజరాజు ఆర్తనాదం, తన కారుని దాదాపు రాసుకుని వెళ్ళిపోతూ ఒక ఆకుపచ్చని కన్వర్టిబుల్‍.. ఒక్కసారిగా ఇహలోకంలోకి తెచ్చాయి తెల్లాయిన్ని.

ఆ కన్వర్టిబుల్‍లో మంచి వయసులో ఉన్న ఒక శలాకలాంటి పిల్ల. ఎర్రని డ్రస్‍లో. పాటలువింటూ, అప్పుడప్పుడు గాలిలో చేతులు ఆడిస్తూ, ఎదురొచ్చిన కార్లని నిర్లక్ష్యంగా దాటుకుంటూ పోతోంది.

తప్పయిపోయింది అన్నట్టు పక్కసీట్లో ఉన్న కాళిదాసు వంక చూసాడు తెల్లాయన. కాళిదాసు దృష్టి అంతా ఆ శలాక మీదే ఉంది. ఆ యవ్వని చలాకీదనం తెగ నచ్చేసినట్టుంది అతనికి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు నవ్వి ఒక శ్లోకం అందుకున్నాడు..

అస్తవ్యస్తం హరితశకటం చాలయంత్యాతురా సా
శృణ్వన్ గీతం శ్రవణకఠినం, భ్రామయన్ సర్వదేహం
భావోత్సర్గే విచరతి కరౌ ముష్టిఘాతాదిచేష్టైః
మధ్యే మధ్యే రచయతి హసన్ మేఘసందేశపాఠాన్

(ఆతురా = వేగంగా పోవాలనుకునే జాడ్యం ఉన్న; సా =ఆమె; అస్తవ్యస్తం = అడ్డదిడ్డంగా; హరితశకటం = ఆకుపచ్చరంగు బండిని; చాలయంతి= కదిలిస్తోంది (driving); శ్రవణ కఠినం= వినడాని కఠోరంగా ఉన్న; గీతం =పాటను; శృణ్వన్ = వింటూ; సర్వదేహం = ఒళ్ళంతటినీ; భ్రామయన్ = త్రిప్పుతూ; భావోత్సర్గే = ఆ పాటవల్లా, ఆ బండి విశృంఖలంగా నడుపుతూండడం వల్లా కల్గిన ఆనందభావాలు పెల్లుబుకుతూండే స్థితిలో; ముష్టిఘాతాదిచేష్టైః = (గాలిలో) పిడికిలితో కొట్టడం లాంటి పనులతో; కరౌ = రెండు చేతుల్నీ; విచరతి = అన్నిదిశల్లో ఊపుతోంది. మధ్యే మధ్యే = మధ్య మధ్యలో; హసన్ = నవ్వుకుంటూ; మేఘసందేశపాఠాన్ = text messages sent by iCloud; రచయతి = వ్రాస్తోంది. )

తెల్ల పండితుడు తల్ల క్రిందులయ్యాడు ఆనందంతో. మనసులో ఉద్వేగం మరింత హెచ్చింది. ఏదో తెలియని కెమిష్ట్రీ తన వంట్లో ఉత్పత్తి అవుతున్నట్టుంది.

“కవీశ్వరా! ఈ అమ్మాయి మీ మేఘ సందేశానికి కొత్త అర్ధం చెబుతోంది. మీ మేఘసందేశంలో వాడిన మందాక్రాంత ఛందంలోనే ఆమె గురించి చెప్పడం ఇంకా అందంగా ఉంది” అన్నాడు.
మాటల్లోనే కాఫీ షాప్ చేరారు.

కాఫీషాప్‍లో అదే లతిక. పార్కింగ్ లాట్‍లో ఆకుపచ్చని అన్వర్టిబుల్ ఆమె ఆమేనని రూఢి చేస్తోంది.

కాలు మీద కాలు వేసుకుని మేఘసందేశాల్ని చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కఫీలతో చప్పరిస్తోంది ఆ కఫీలతిక.
భోజుడికి లోకమంతా వింతగా కనబడుతోంది. తన రాజ్యంలోనే గొప్ప భోగాలూ, అందాలూ ఉన్నాయని ఆయన నమ్మకం. కాని ఆ నమ్మకం నిజం కాదని ఒక పక్క అనిపిస్తున్నా, ఇది అంతా భవిష్యత్తులో గదా! అని సరిపెట్టుకుంటున్నాడు.

తెల్లాయనా, కాళిదాసూ వాళ్ళకి మాకియాటోలు, భోజుడికి మిల్క్‍షేకూ తెచ్చి లతిక ప్రక్క టేబుల్ దగ్గర చతికిలబడ్డారు.

తెల్లాయన మాకియాటో చప్పరిస్తూ తదేకంగా భోజుడి వంక ఒకసారీ, కాఫీతాగే లతిక వంక ఒకసారీ చూస్తూ కూనిరాగం తీస్తున్నాడు. అలా ఒక సామాన్యుడు తన ఎదురుగా కాలుమీద కాలేసుని తన కళ్ళలోకి చూడడం అలవాటు లేక భోజుడికి అతని వాటం నచ్చటం లేదు. కాళిదాసు తెల్లాయన్ని ఒక కంటా, ఆ కఫీ లతికని మరో కంటా చూస్తున్నాడు.

వీళ్ళ చూపులకి లతికకి ఒళ్ళుమండింది. ‘దిస్ ఈజ్ రూడ్’ అనుకుంటూ కళ్ళుపెద్దవి చేసి, కనుబొమలు ముడిచి వాళ్ళని చూస్తూ తన కాఫీకప్ తీసుకుని సర్రునలేచి బైటకి వెళ్ళిపోయింది. తెల్లాయన తన ప్రవర్తనకి సిగ్గుపడి తలవంచుకున్నాడు. ‘వీడికి ఇప్పటికి బుద్ధొచ్చింది’ అనుకున్నాడు భోజుడు. ఇంతలో మనోహరమైన కాళిదాస స్వరం వినిపించింది ఇద్దరికీ..

“కాఫ్యోషధీయుక్తపయఃప్రపానాత్” ఆగాడు కాళిదాసు.

“సర్వాంగశోభై రభిభాతి బాలా” కాళిదాసు స్టైల్లో రెండవ పంక్తి చెప్పాడు తెల్లాయన తన కవిత్వానికి తనే ఆశ్చర్యపోతూ.

కాళిదాసు ప్రోత్సాహకరంగా తలూపుతూంటే, “తనౌ తు వేణ్యాం ఖలు దృశ్యమానౌ” అని మరో పంక్తి అందించాడు తెల్లాయన.

ముక్తాయింపుగా “నేత్రద్వయం తిష్ఠతి సాక్ష్యమేవ” అన్నాడు కాళిదాసు.

తెల్లాయనకి పరమోత్సాహంతో మొత్తం శ్లోకం మరోసారి చదివాడు.

కాఫ్యోషధీయుక్తపయఃప్రపానాత్
సర్వాంగశోభై రభిభాతి బాలా
తనౌ చ వేణ్యాం ఖలు దృశ్యమానౌ*
నేత్రద్వయం తిష్ఠతి సాక్ష్యమేవ

(బాలా = ఈ చిన్నది; కాఫ్యోషధీ యుక్త = కాఫీ డికాక్షన్తో కలిసిన; పయః = పాలను; ప్రపానాత్ = ఆరారగా పుచ్చుకోవడం/ త్రాగడం వల్ల; సర్వాంగశోభైః = అన్ని అవయవాల శోభలతో; అతిభాతి = తళుక్కుమంటోంది. తనౌ = ఒంటిలోనూ; చ = మరియు; వేణ్యాం = కురులలోనూ; దృశ్యమానౌ ఖలు = ఆ శోభలు కనబడుతునే ఉన్నాయి గదా! *; నేత్రద్వయం = ఆమె కళ్ళజంట; సాక్ష్యం ఇవ = ఈ శోభకి కారణమైన దానికి సాక్ష్యంలాగా; తిష్ఠతి = నిలబడి ఉంది. )

*ఇక్కడ పాలలో తెల్లదనం దేహంలోనూ, కాఫీ డికాక్షన్ రంగు ఆమె జుట్టులోనూ శోభాయమానంగా ఉన్నాయని చెపుతున్నాడు.

ఇక్కడ ఆమె కంటిపాపని పాలచుక్కగానూ, కంటిగుడ్డును ఆ పాలచుక్కలో ఈదే కాఫీగింజగానూ భావిస్తున్నాడు కాళిదాసు.

గౌరవం పెల్లుబుకుతూంటే భోజుడికి నమస్కరించాడు తెల్లాయన.

కాళిదాసు నవ్వుతూ “ప్రొఫెసర్! ఇప్పటికైనా నమ్ముతారా మా భోజ మహారాజు ముఖంచూస్తే ఎవరికైనా కవిత్వం వస్తుందని?” అన్నాడు.

“తనని ఇక్కడికి తెచ్చినది ఇందుకా?” అని భోజుడికి ఇసుమంత కోపం వచ్చిన మాట నిజమే కాని, సాహిత్య పక్షపాతి కాబట్టి సర్దుకుని, చిరునవ్వుతో తెల్లాయనకి తన మెడలోని రత్నాలహారాన్ని బహూకరించాడు.

*****

రచయిత దీన్ని కేవలం వినోదం కోసం వ్రాసినదిగా పరిగణించమని పాఠకులకి విఙ్ఞప్తి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)