ధారావాహికలు
మరీచికలు
- వెంపటి హేమ

(గత సంచిక తరువాయి)

బాగా పొద్దెక్కాక గాని నిద్రలేవలేదు వకుళ, యామినీ కూడా. వాళ్ళు కాఫీలు తాగి, హాల్లోకి వచ్చేసరికి, పోలీసు జీప్ వచ్చి గుమ్మంలో ఆగింది. దాంట్లోంచి దిగి యూనిఫారంలో ఉన్న సుధాకర్ గేటు తెరుచుకుని లోనికి రావడం వాళ్లకు వోరవాకిలిగా తెరిచి ఉన్న తలుపు సందులోంచి కనిపించింది. అతని వెంట మరో ఇద్దరు - ఒక ఆడ, ఒక మగ - పోలీసులు కూడా గేటు తెరుచుకుని లోపలకు వచ్చారు. కాని వాళ్ళు గుమ్మం బయట నిలబడ్డారు, సుధాకర్ మాత్రం లోపలకు వచ్చాడు.

అతన్ని చూడగానే యామినికి నిన్న జరిగిందంతా గుర్తొచ్చి, మనసు సిగ్గుతో, బాధతో కుంచించుకు పోతున్నట్లు అనిపించింది. కాని తన బాధ అతనికి తెలియనీయకూడదని, మనసు కూడదీసుకుని, అతన్ని మామూలుగా పలకరించాలని ప్రయత్నించింది .....

"హలో సుధా! వండర్ ఫుల్ గా సూటయ్యింది ఈ యూనిఫాం నీకు! బై ది బై - ఏమిటి ఈ సమయంలో నువ్వు మందీ మార్బలంతో ఇలా వచ్చావు" అని అడిగింది.

సుధాకర్ ఏమీ జవాబు చెప్పకుండా యామినినే చూస్తూ నిలబడిపోయాడు. యామినే మళ్ళీ హెచ్చరించింది. .......
"సుధా! మాట్లాడవేం? నా ప్రశ్న నీకు వినిపించలేదా ఏమిటి ?"

"డామిట్! డ్యూటీ మీద ఇటు రావలసి వచ్చింది. తప్పేదారి లేదు, వచ్చా! కుశల ప్రశ్నలకోసం కాదు" అన్నాడు సుధాకర్. అలా అంటూన్నప్పుడు చూస్తూండగా అతని ముఖం ఎర్రగా కందిపోయింది. ఎంతో బాధను భరిస్తున్నవాడిలా కనిపించాడు సుధాకర్ ..

అతని వాలకం చూసి స్నేహితురాళ్ళిద్దరూ విస్తుపోయారు. "ఏమిటి సుధా? ఎందుకలా ఉన్నావు" అంటూ ఆదుర్దాపడుతూ అడిగింది యామిని.

"ఏమిటని అడుగుతున్నావా? ఐతే ఇంకా ఈ వార్త మీకు తెలియలేదన్న మాట! నిన్నరాత్రి సుదర్శనాన్ని ఎవరో హత్య చేశారు. నిలువునా రెండు ముక్కలుగా నరికేశారు!"

"నిజమా" అని ఒక వెర్రికేక పెట్టి చేష్టలు ఉడిగి నేలమీద కూలబడిపోయింది యామిని.

సుదర్శనం పట్ల యామినికి ఎంత ఏవగింపు కలిగినా, అతడలా అతిదారుణంగా హత్య చెయ్యబడ్డాడన్న వార్త ఆమె భరించలేకపోయింది. అతని మాటలు తనను ఎంత గాయపరచినా, అతడు చావాలని ఆమె ఎంత మాత్రం అనుకోలేదు. ఆ దుర్వార్త ఆమెకు పిడుగుపాటయ్యింది.

"యామినీ బేలవు కావద్దు, ధైర్యం తెచ్చుకో. ఇది అప్పుడే ఐపోలేదు. ఇంకా ఉంది, నువ్వు శ్రద్ధగా వినవలసింది .... ! ఈ కేసులో ప్రయిం సస్పెక్టువి నువ్వే! నరహరి నీ మీద నేరం మోపాడు. "

ఈ మాటు "కెవ్వు" మన్నది వకుళ. " అంతా అబద్ధం! యామిని ఎంత మాత్రం అటువంటిది కాదు, అటువంటి పనులు ఆమెవల్ల కావు" అంటూ ఆక్రోశించింది ఆమె.

ఆమెకేం జవాబు చెప్పలేదు సుధాకర్. యామిని నుద్దేశించి, "నిన్న సాయంకాలం నువ్వు చీకటి పడేవేళ ఆ ఇంటికి వెళ్ళావుట, నిజమేనా" అని సూటిగా అడిగాడు.

యామిని కళ్ళు తుడుచుకుంటూ, "వెళ్ళింది నిజమేగాని, అక్కడి పరిస్థితులు నచ్చక వెంటనే తిరిగి వచ్చేశా. శాస్త్రిగారు వచ్చి, "తొమ్మిదవ రోజునుండీ నాన్నకి కర్మలు జరిపించడం బాగుంటుంది" అన్నారు. ఆ మాట ఆయనకి చెప్పాలనిపించి అక్కడికి వెళ్ళా, కాని చెప్పకుండానే తిరిగి వచ్చేశా" అంది తల వంచుకునే, గద్గద స్వరంతో నెమ్మదిగా.

"మరి ఆయను కలుసుకో లేదా?" సుధాకర్ క్రాస్ ఎగ్జాం చెయ్యడం మొదలుపెట్టాడు.

" లేదు. అసలు కలుసుకోలేదు. అక్కడి వాతావరణం నాకు నచ్చలేదని చెప్పాకదా, అందుకే అతణ్ణి కలుసుకోకుండానే, వెంటనే వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశా. నేను వెళ్ళేసరికి నరహరి అక్కడే ఉన్నాడు."

" నువ్వు తిరిగి వెళ్ళిపోడం కూడా చూశాడా నరహరి?"

"ఏమో అది నాకు తెలియదు. ఆ సమయంలో నేను అవమాన భారంతో ఒళ్ళు తెలియవి స్థితిలో ఉన్నాను . ఇంతకంటే ఏమీ అడక్కు, నేను చెప్పలేను" అంది యామిని, తలను మరింతగా భూమిలోకి వంచేసుకుని. అంతకంటే ఆ నికృష్ట దశను ఎలా వర్ణించి చెప్పాలో ఆమెకు తెలియలేదు.

"చాలు, ఇంకేమీ చెప్పొద్దు" అన్నట్లు, అరచెయ్యి అడ్డంపెట్టి సైగ చేశాడు సుధాకర్. ఇన్వెస్టిగేషన్లో సుదర్శనాన్ని గురించి ఆ సరికే చాలా తెలుసుకున్నాడు సుధాకర్ IPS !

ఏడ్చి ఏడ్చి యామిని కళ్ళు పొడిబారిపోయాయి. క్రమంగా, హృదయ భారాన్ని కొంతవరకూ కరిగించే కన్నీళ్ళు కూడా కరువయ్యాయి ఆమెకి! భావోద్వేగంతో బరువెక్కిన మనసుని ఎలాగో చిక్కబట్టుకుని తప్పనిసరిగా జవాబులు చెపుతోంది సుధాకర్ కి.

సుధాకర్ కీ తెలుసు యామిని అటువంటి హత్యలకు పాల్పడే రకం మనిషి కాదని. కాని డ్యూటీ చెయ్యక తప్పదు కదా! డ్యూటీలో ఉన్న పోలీసుకి కర్తవ్య నిర్వహణమే ముఖ్యం. రాగద్వేషాలకు అతీతంగా పని చెయ్యవలసి ఉంటుంది. డ్యూటీ ఫస్టు! దాని తరవాతవే తక్కినవన్నీ! మరీ ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్నాడేమో, సుధాకర్ కి పోలీస్ అకాడమీలో నేర్చుకున్న సూక్తుల్ని ఇంకా మరచిపోలేదు. .

అతి భయంకరమైన మర్డర్ కేసులో యామిని ఇప్పుడొక "ప్రైం సస్పెక్టు'! నిజమైన హంతకు డెవరో నిర్ధారించబడే వరకూ, ఆమెను దోషిగా అనుమానించి, తప్పించుకు పారిపోనీయకుండా కనిపెట్టి చూడాల్సిన పూచీ సుధాకర్ కి ఉంది.

ఈ దెబ్బకి ఇక తట్టుకోలేక, యామిని పూర్తిగా కృంగిపోయింది. అక్కడితో ఆమె ఆత్మ స్థైర్యం సాంతం నశించిపోయింది. తాను తొందరపడి సుదర్శనాన్ని పెళ్ళాడి చాలా పెద్ద తప్పుచేసిందన్న భావం, తన తండ్రి పడిన బాధ ప్రత్యక్షంగా చూసినది మొదలు, ప్రతిక్షణం ఆమె మనసును కల్లోల పరుస్తూనే ఉంది. అప్పటినుండి పశ్చాత్తాపం ఆమెను నిలువునా దహించేస్తోంది. ఇప్పుడామె తలెత్తి ఎవరిమొహం వైపూ చూడలేకపోతోంది.

" ఆ చంపినవాడెవరో మంచి ఆరితీరిన వాడయ్యి ఉంటాడు. సుదర్సనం తోపాటు అక్కడ ఒక ఆడమనిషి కూడా ఉంది. ఒకే వేటుకి ఇద్దర్నీ నరికి పారేశాడు. ఆమె ఆ ఇంట్లో వంటచేసే మనిషి - అన్నాడు నరహరి. జుగుప్సాకరంగా ఉంది ఆ దృశ్యం. చూడలేకపోయా. శవాల్ని పోస్టుమార్టంకి పంపి, ఇల్లు సీల్ చేయించి, వెంటనే ఇలా వచ్చాను."

యామినికి ఆ సంగతులను వినవలసి రావడంతో తలకొట్టేసినట్లై, తల తీసుకెళ్ళి భూమిలో దాచుకోవాలనిపించింది ఆమెకు. మనసంతా దు:ఖంతో మరిగిపోతూండగా మళ్ళీ ఒకసారి తలుచుకుంది, " అవస్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం!". ఆ మాటని ఆమె అలా తల్చుకోడం అది ఎన్నోసారో!

"నీ వెనకాలే ఒక ఆసామీ కూడా వచ్చాడంటున్నాడు నరహరి, ఎవ రతను?"

తెల్లబోయింది యామిని. " నా వెంట ఆసామీయా! నే నెవర్నీ వెంట తీసుకు వెళ్ళలేదు. ఒంటరిగానే వెళ్ళా."

" ఐతే ఈ విషయం నీకు తెలియదు కాబోలు! విను. నువ్వక్కదకి వెళ్ళగానే, నీ వెనకాలే ఒకతను వచ్చాడుట! నరహరి అతన్ని ఆపి, ఎవరని అడిగితే, "నే నొక కంసాలిని, అయ్యగారు అమ్మగారికి నగలు చేయిస్తానన్నారుట! అమ్మగారు నన్ను రమ్మన్నారు" అని, అతడు అన్నాడని చెప్పాడు నరహరి. అతడు, "అయ్యగారూ, అమ్మగారూ మేడ మీద ఉన్నారు, వెళ్ళు" అని చెప్పి అతన్ని పైకి పంపాడుట. ఆ తరవాత నరహరి ఇంటికి వెళ్ళిపోయాడుట. నువ్వే ఆ వ్యక్తిచేత సుదర్సనాన్ని చంపించి ఉంటావు - అన్నది నరహరి కథనం."

యామిని మరింత ఖిన్నరాలయ్యింది. "నేను నిజం చెపుతున్నాను, నే నసలు మేడ మీది కంతా వెళ్ళిందే లేదు. మెట్లమీద ఉండగానే నేను వినకూడని మాటలు వినవలసి వచ్చింది. దాంతో అక్కడనుండే వెనక్కి తిరిగి వచ్చేశా. ఇంకొక్క నిమిషం కూడా నేను అక్కడ ఆగలేకపోయా. నరహరి ఎందుకనో అబద్ధం చెపుతున్నాడు. నాన్నపోయిన దు:ఖంలో ఉన్న నాకు నగలు కావాలా ఏమిటి! ఐనా నాకు నగలు చేయిస్తానని ఎవరూ అననూలేదు, అసలు ఆ అవకాశం మామధ్య రానూలేదు. నాన్న పోయిన రోజునే సుదర్శనం గారు తన ఇంటికి వెళ్ళిపోయారు. స్మశానం వరకూ కూడా రాలేదు ఆయన. ఆ తరవాతి నాలుగు రోజుల్లోనూ అతనూ నేనూ కలుసుకోనే లేదు. అందుకే పెద్దకర్మ గురించి మాటాడడానికి నేను అక్కడికి వెళ్ళాల్సివచ్చింది. " వంచుకున్న తల పైకి ఎత్తకుండానే మాటాడింది యామిని.

"అంతే అనుకోకు! ఇంకా చాలా చెప్పాడు నరహరి. అతడు రోజూలాగే ఈ రోజుకూడా ఉదయం ఎనిమిది గంటలకి సుదర్శనం ఇంటికి వచ్చాడుట. వీధి తలుపు ఓరవాకిలిగా ఉందిట. ఇంట్లో మనిషి అలికిడి లేదుట. సుదర్శనం కోసం కిందంతా వెతికి, మేడమీదికి కూడా వెళ్లి చూడాలని, మెట్లెక్కుతున్న నరహరికి మెట్లమీద రక్తం ధారగా కనిపించిందిట! భయంతో కేకలు పెడుతూ వీధిలోకి పరుగెత్తాడుట నరహరి. ఆందరూ పోగుపడి చూశారుట. సుదర్శనం హత్య చేయబడిన విషయం అప్పుడు బయట పడింది - అన్నాడు .

వెంటనే మమ్మల్ని పిలిచారుట! ఇంతకీ, నరహరి అనేదేమంటే, నువ్వే .... , సుదర్శనం నిన్ను ఘోరంగా మోసం చేశాడన్న కసితో సుదర్శనాన్నీ, సపత్నీ సహజమైన మత్సరంతో వెంకటలక్ష్మినీ, ఆ కంసాలినంటూ వచ్చిన మనిషి చేత చంపించేశావని చెపుతున్నాడు నరహరి. అతని మాటలనుబట్టి నువ్వీ జమిలి హత్యల కేసులో ప్రైం సస్పెక్టు వయ్యావు. నిన్ను ఇప్పుడు నేను అరెష్టు చెయ్యవలసి ఉంది. అందుకే వచ్చాను. "

"నరహరి మాటలే నమ్ముతావా సుధా! నా మాటలు నమ్మవా?" నీరసంగా అడిగింది యామిని.

"యామినీ, అర్ధంచేసుకో! నే నిప్పుడు నీ ఫ్రెండ్ సుధాకర్ని కాను. నీ మాటల్లోనే చెప్పాలంటే సుధాకర్ I.P.S. ని, పోలీస్ ఇనస్పెక్టర్ని. కేసు రుజువయ్యేదాకా ఎవరూ దోషులు కారు, ఈ కేసులో కేవలం అనుమానితులు మాత్రమే! మాకు సాక్ష్యాలు కావాలి కేసుని నిరూపించడానికి, నమ్మకాలు కావు. ముందు పోస్టు మార్టం రిపోర్టు రావాలి. అప్పుడుగాని కేసుకి ఒక రూపం రాదు. ఇక నిజమైన అపరాధ పరిశోధన మొదలయ్యేది అప్పటినుండే!"

"నువ్వు నమ్ము, నమ్మకపో - నేను అక్కడకి వెళ్ళింది, నాన్నకి పెద్దకర్మ చెయ్యడానికి శీఘ్రం చెయ్యాల్సిన ఏర్పాట్లకోసమే గాని, నగలకోసమూ కాదు, హత్యల కోసమూ కాదు. వెళ్ళానన్న పేరేగాని అతన్ని కలవకుండానే తిరిగి వచ్చేశా."

"యామినీ! నీ మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. కాని ఏం లాభం! నరహరి స్టేట్మెంటునిబట్టి, నువ్వు ప్రైం సస్పెక్టువి కనక నేను నిన్ను అరెష్టు చేసి రిమాండులో ఉంచడం అన్నది నా డ్యూటీ! నిజమైన హంతకు డెవరో తేలాకనే నిన్ను విడుదల చెయ్యాల్సివుంది . అది ప్రోసీజర్. కాని .....

ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నేను నిన్ను జైలుకి తీసుకెళ్ళలేను. దానికి బదులు, నా స్వంత పూచీ మీద, నిన్ను హౌస్ అరెష్టులో ఉంచుతున్నాను. ఇప్పుడు నా పైవాడు సెలవుమీద ఉన్నాడు. నేనే బాస్ ని! సాహసించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక కానిస్టేబుల్ని మీ గుమ్మంలో కాపలాగా ఉంచక తప్పదు. నన్ను క్షమించు. లేకపోతే నేను నా ఉద్యోగ ధర్మాన్ని నిర్లక్ష్యం చేసినట్లవుతుంది.

యామినీ! నిన్నునే నెరుగుదును. నీ మీద నాకే అనుమానమూ లేదు. నరహరి ఎందుకో నిన్నీ కేసులో ఇరికించాలని చూస్తున్నా డనిపిస్తొంది. భయపడకు, ఇన్వెస్టిగేషన్ లో నిజాలన్నీ బయట పడతాయి. ఎంక్వయిరీలో, సుదర్శనానికి దాయాదులతో ఎప్పటినుండో తగువులున్నాయని తెలిసింది. వాళ్ళల్లో ఎవరైనా ఈ ఘోరం చేసి ఉంటే, వాళ్ళ దృష్టి నీ మీదకూడా ఉంటుంది. నువ్వు సుదర్శనాన్ని పెళ్ళిచేసుకోడం వల్ల, ఇప్పుడు లీగల్గా అతని ఆస్తి మొత్తం నీదౌతోంది. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి !."

"ఐనది చాలు! ఇంక నా కెవరి ఆస్తులూ వద్దు. నువ్వు చెప్పినట్లుగా, నేనే కనక హక్కుదారు నైతే, ఆస్తి నా చేతికి రాగానే ఎవరిది వాళ్ళకు ఇచ్చేస్తా. ఆపై ఇంకా ఏమైనా మిగిలి ఉంటే దాన్ని "నిర్మల్ హృదయ్ హోం"కి సుదర్శనం పేరు మీదే దానంగా సమర్పిస్తా. నా కందులో చిల్లుగవ్వ కూడా అక్కర లేదు. నా రెక్కలు నాకున్నాయి. ఈ రొచ్చులోంచి బయటపడితే చాలు, నా బ్రతుకు నేను బ్రతుకుతా" అంది యామిని నిరీహతో.

"సారీ, యామినీ! సాధ్యమైనంత త్వరలో నేరస్తులను పట్టి, నేరం నిరూపించి, నీకీ చెర తప్పిస్తా. కొద్ది రోజులు ఓపిక పట్టు."

"నా కెందుకో నరహరికి అంతా తెలుసు, కావాలనే యామినిని ఈ కేసులో ఇరికించడం కోసం రకరకాల కథలు అల్లుతున్నాడనిపిస్తోంది" అంది, అక్కడే ఉన్న వకుళ, డిటెక్టివ్ పుస్తకాలు తెగ చదివిన పరిజ్ఞానంతో.

"నాకూ అదే అనుమానం ఉంది. "అతివినయం ధూర్త లక్షణం" అంటారు. ఏంతో విశ్వాసపాత్రుడుగా కనిపించే నరహరి దంతా కపటనాటకం కావచ్చు! యజమానికి తగిన బంటు అతడు - అని నా నమ్మకం " అన్నాడు సుధాకర్.యామినితొ. .

ఆపై వకుళవైపు తిరిగి, " థాంక్సు వకుళా! మంచి సలహా ఇచ్చావు. అతన్ని దులిపి చూస్తా... ఏమేమి బయట పడతాయో! దానికి మా పద్ధతులు మాకు ఉన్నాయిలే!నువ్వు మాత్రం యామినిని జాగ్రత్తగా చూసుకో సుమీ! ఇక నే వెళతా" అంటూ అతడు వెళ్ళిపోయాడు. అతని వెంట వచ్చిన వాళ్ళలో, ఒక్క పోలీసు మాత్రం తుపాకి బుజాన ఉంచుకుని, కాపలాగా గుమ్మంలో ఉండిపోయాడు.

* * *

ఒంటరిగా తులసి కోటదగ్గర కూర్చుని, కన్నీరు కారుస్తున్న రమణమ్మను చూసి దగ్గరగా వచ్చింది రాజేశ్వరి.
ఏడుస్తూనే మాటాడింది రమణమ్మ. "రాజమ్మా! మనకి ఇదేం ప్రారబ్ధం చెప్పు! మరీ ఇంత కానిరోజులు వచ్చి పడ్డా ఏమిటి? ఈ కొంపకి ఘోరమైన శని ఏదో గట్టిగా పట్టినట్లుంది! కాకపోతే, కష్టాలన్నీ కలిసికట్టుగా, ఒకదాని వెంట ఒకటి, ఇలా ఎందుకు మనని తరుముకుని వస్తాయి చెప్పు? నేను మా అన్నయ్యతో మొదటినుండీ అంటూనే ఉన్నా - ఆడపిల్లని, ఆడపిల్లలాగే పెంచాలి అన్నయ్యా - అని! మా అన్నయ్య నా మాట పట్టిం చుకుంటే కదా! దీన్ని చూడు, ఇప్పుడేమయ్యిందో! దీనికి, ఆడపిల్లలా చక్కగా పెద్దవాళ్ళ ఒద్దికలో పడి ఉండడమూ చేతకాలేదు, అలాగని మగపిల్లాడిలా, "ఏది ఏమైతే నాకేమిటి" అనుకుని, నిర్లక్ష్యంగా ఎక్కడి వక్కడ జులపరించేసి, దర్జాగా తోసుకు తిరగడమూ చేతకాలేదు. ఎలా అఘోరించిపోతోందో చూస్తే, దు:ఖంతో నా కడుపు చెరువై పోతోంది " అంది.
ఏమనడానికీ తోచక యామిని పరిస్థితికి తానూ కన్నీరు పెట్టుకుంది రాజేశ్వరి. యామిని పైన వరసగా విరుచుకుపడిన కష్టపరంపరని చూసి, రమణమ్మ మనసు కరిగి నీరయ్యింది . వెంటనే ఆమె పూర్తిగా, మేనకోడలిపైన తనకు వచ్చిన కోపాన్ని, మరిచిపోయింది. ఆమె మనసులో దాగి ఉన్న తల్లై పెంచిన ప్రేమ పొంగులువారింది.

కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ అంది రమణమ్మ, " ఇదేం బాగుందో చెప్పు రాజమ్మా! పిల్ల పట్టెడు మెతుకులు తిని ఎన్నాళ్ళయ్యిందో! అసలే అది, తండ్రి పోయినందుకే దిగులుతో తిండీ, నీళ్ళూ మానేసి, వటించిపోతోంది కదా! అది చూడలేకే బాధపడుతూంటే అది చాలక, "ఉన్నకర్మకు ఉపాకర్మ కూడా తోడయ్యింది" అన్నట్లుగా, ఈ హత్య గోలొకటి వచ్చిపడింది. ఇప్పుడింక ఏం అఘోరించి చావాలో నాకేం అర్థమవ్వడంలేదు" అంది ముక్కు ఎగబీలుస్తూ.

రాజేశ్వరిది కూడా గాయపడ్డ మనసే కావడంతో రమణమ్మ బాధ ఆమెకు సరిగానే అర్ధమయ్యింది. ఆమెకు కూడా దు:ఖం పొంగుకొచ్చింది. "అక్కయ్యా! అప్పుడే ఏమయ్యిందిట! ఇక చూడు, కొంచెం సేపట్లో పరామర్శలని వంకపెట్టుకుని వచ్చి ఇంటి మీద పడతారు అమ్మలక్కలు, కూపీలు లాగడానికి! లోకులు పలుగాకులు - అంటారు కదా!. ఆ వచ్చిన వాళ్ళు ముక్తసరిగా పలకరించి ఊరుకుంటారా - అంటే, అదీ ఉండదు. ఇనపముక్కులున్న కాకుల్లా వచ్చిపడి, అడ్డమైన ప్రశ్నలతో మనసు తూట్లు పడీలా పొడిచి పొడిచి వేధిస్తారు. మన బాధలు వాళ్ళకి ఎంతమాత్రం పట్టవు. "ఎద్దుపుండు కాకికి నెప్పా ఏమిటి అక్కయ్యా?

ఇప్పుడు మనం వీళ్ళ బారినుండి యామినిని కాపాడడం ఎలాగో ఏమిటో" అంది రాజేశ్వరి విచారంగా.

"ఈ సరికి ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయే ఉంటుంది, ఎంత అప్రతిష్ట! ఇంటికి ఆఫీసర్ల రాక పోకలు, ఇంటి ముందు పోలీసు కాపలా! ఆహా, ఏం వైభోగం! పాపం పైవాళ్ళ తప్పేముందిలే, ఇదంతా చూస్తూంటే, ఎవరికైనా పుడుతుంది సాంతం తెలుసుకోవాలన్న కుతూహలం! రోటిలో తలకాయ చిక్కుకున్నాక, ఇక రోకటిపోటుకి భయమెందుకులే! అంతా మన కర్మ.. ,కర్మ.., అంతా మన కర్మ" అంటూ రమణమ్మ తలని తులసి కోటకి వేసి కొట్టుకోసాగింది. గమ్మున రాజేశ్వరి ఆమెను పట్టి ఆపింది.

ఆ దగ్గరలోనే ఉన్న వకుళకు వాళ్ళ మాటలన్నీ వినిపించాయి. ఆమె ఒళ్ళు ఘల్లుమంది. ఎలాగైనా యామినిని ఆ అమ్మలక్కల బారినుండి కాపాడాలి - అనుకుంది. చేతిలోఉన్న పని పక్కన పడేసి, వెంటనే ఆమె వీధిగుమ్మం లోకి పరుగుపెట్టింది.

ఈ ఇంట్లో ఉన్న జనం కొత్త ఇనస్పెక్టర్ కి కావలసిన వాళ్ళని తెలిసి ఉన్న పోలీసు, వకుళ రాగనే గౌరవంగా లేచి, సాల్యూట్ చేసి, అటెన్షన్లో నిలబడ్డాడు.

అతనికి చెప్పింది వకుళ, " జనం, పరామర్శల పేరుతో వచ్చి, రకరకాల ప్రశ్నలడిగి మన యామినమ్మని వేధిస్తారు. మీరు ఎవర్నీ లోపలకు పంపించ వద్దు. పరామర్శలకు ఇది సమయం కాదని చెప్పెయ్యండి, ఫరవాలేదు " అంది.
"అయ్యగారు నా కామాట చెప్పలేదుకదమ్మా! ఆర్డర్ లేనిదే........ "

"అయ్యగారు మర్చిపోతే అమ్మగారు ఇఛ్ఛింది ఆర్దర్ అనుకోండి! ఇప్పుడు వాళ్ళను లోపలకు వదిలితే, అడగకూడని ప్రశ్నలన్నీ అడిగి, ఆమెను బాధపెడతారు. కాకుల్లా పొడిచి పొడిచి కూపీల్లాగాలని చూస్తారు. ఆమె పడుతున్న కష్టాలు చాలవా? ఈ బాధలు కూడా పడాలంటారా, చెప్పండి? ఆమెను సాధ్యమైనంత బాగా చూసుకోవాలి మనం. మీరు కాదంటే ఎవరూ లోపలకు రాలేరు. ప్లీజ్" అంది వకుళ.

"సర్లెండమ్మా! అలాగే చేద్దాం. ఎవర్నీ లోపలకు అడుగు పెట్టనివ్వను, సరేనామ్మా!"

"కొంచెం వినండి, ఒక చిన్న సవరణ వుంది - కాలేజిలో ఇంగ్లీషు చెప్పే మాష్టారు, మురళీగారు - తెలుసు కదూ......? "
"తెలుసమ్మా! జాతకాలుచెప్పే సోమయాజులుగారి అబ్బాయి కదూ......?"

" ఔను, ఆయనే! ఆ కుటుంబాన్ని మాత్రం లోపలకు పంపించండి, వాళ్ళు మనకు సాయం చెయ్యడానికి వస్తారు" అంది వకుళ.

"అలాగే నండమ్మా, మీరు చెప్పినట్లే చేస్తా " అన్నాడు పోలీసు.

పోలీసుని మరోసారి హెచ్చరించి, అతని దగ్గర మాట పుచ్చుకుని సంతృప్తితో ఇంట్లోకి వెళ్ళింది వకుళ.
.

* * *

సోమయాజులుగారి పూజ ఒక కొలిక్కి వచ్చినదానికి గుర్తుగా, పూజగదిలో నుండి గంటా నాదం వినిపిస్తోంది. మహానివేదన కోసమమని వండిన వంటకాలన్నీ, పళ్ళెంలో ఆరటాకుపరిచి, దానిలో ఆ రోజు వండినవన్నీ కొంచెం కొంచెంగా వడ్డించి తెచ్చిన మాధవి, పళ్ళెం క్రింద పెట్టి , అక్కడే నిలబడింది. అప్పుడు ఆమె మడిగట్టుకుని ఉంది. హారతి అయ్యాక హారతి కళ్ళకు హత్తుకుని, మామగారు ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకుని, అలికిడి విని, సావదడిలోకి వచ్చింది ఆమె.

పచారీ సామాను తేవడానికి షాపుకి వె ళ్లిన మురళీ, సామాను తీసుకుని తిరిగి వచ్చాడు. తెచ్చినవన్నీ నట్టింట పెట్టించి, రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసి, వచ్చి కుర్చీలో కూలబడి, రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని ఉండిపోయాడు . అప్పుడే అక్కడకు వచ్చిన మాధవి అతనివైపు నిర్ఘాంతపోయి చూసింది. భర్త అంతలా డీలాపడి ఉండడం చూసి, కంగారుపడి మడిమాట మర్చిపోయి దగ్గరగా వచ్చేసింది.

బుజం మీద చెయ్యేసి, "ఏమయ్యింది బావా? ఎందుకలా ఉన్నావు" అంటూ భర్తని ఆత్రంగా అడిగింది మాధవి.

తలెత్తి ఆమె ముఖంలోకి వెర్రిగా చూశాడు మురళీ. "ఏం చెప్పను మాధవీ! రాత్రి ఎవరో పాపులు సుదర్శనాన్ని హత్య చేశారుట! బజార్లో అందరూ అదే చెప్పుకుంటున్నారు. పెళ్ళి జరిగి వారమయ్యిందో లేదో, అప్పుడే యామినికి ఇలా.... " అతని గొంతుక దు:ఖంతో గద్గదమయ్యింది. మురళీ ఇక మాట పూర్తి చెయ్యలేకపోయాడు.

" నిజమా బావా! బొత్తిగా నమ్మశక్యం కావడంలేదు" అంది మాధవి ఎలుగు రాసిన కంఠంతో.

"నా కసలు నమ్మాలనిపించడం లేదు మాధవీ, కాని బజారంతా కోడై కూస్తోంది!"

"యామినికి ఇన్ని కష్టాలేమిటి బాబూ! దేవుడు పగబట్టినట్లు అనిపిస్తోంది, ఇదంతా చూస్తూంటే! లేకపోతే ఏమిటిట? తండ్రి పోయి వారం కూడా కాలేదు అంతలోనే మళ్ళీ ఈ ఉపద్రవమా!"

సోమయాజులుగారు పూజ ముగియడంతో సావడిలోకి వచ్చారు. కొడుకూ కోడలూ లోగొంతుకుతో గుసగుసలాడుకోడం విని, " ఏమిట్రా అబ్బాయీ! ఏమిటా గుంపిచింపీలు" అని అడిగారు.

"యామిని భర్త నిన్నరాత్రి చనిపోయాడుట మామయ్యా" అంది మాధవి టూకీగా.

"శివ శివా! అనుకున్నంతా ఐపోయిందా? ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. కాని, ఇంత తొందరలోనే ఇలా ఔతుందని మాత్రం నేను కలలో కూడా అనుకున్నది లేదు" అన్నారు ఆయన దు:ఖంతో బరువెక్కిన కంఠ స్వరంతో.

"ఐతే నాన్నా! ఈ హత్య చేసింది ఎవరో మీకు ముందే తెలుసన్నమాట!" ఆశ్చర్యపోయాడు మురళీ. .

"హత్యా! హత్యేమిటి? " సోమయాజులుగారు నిలువునా కొయ్యబారిపొయారు.

" నాన్నా! ఆ సుదర్శనం మామూలుగా పోలేదు, ఎవరో గడచినరాత్రి అతన్ని కత్తితో రెండు ముక్కలుగా నరికేశారుట. నీకు వాళ్ళెవరో ...... "

సోమయాజులుగారు కంగారుపడుతూ అతని మాటకి అడ్డొచ్చారు, " థూ నా బొడ్డు! ఆపు! నా ఉద్దేశం ఎంతమాత్రం అది కాదు, నాకు తెలుసినది యామిని జాతకరీత్యా మాత్రమే! చాలా ఏళ్ళ క్రిందట, ఒకసారి విశ్వనాధం యామిని జాతకం నా దగ్గరకు తెచ్చాడు. విద్య, గుణం, రూపం వగైరా లన్నీ శుభలక్షణాలే ఉన్నాయి గాని మాతృ వియోగం ఉందన్నది, చూడగానే కొట్టొచ్చినట్లు కనిపించింది ఆ జాతకంలో! ఆ పైన దారుణమైన కుజదోషం కూడా ఉంది ఆమెకు. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే మాతృ వియోగం అన్నది జరిగిపోయింది. ఇక మిగిలింది కుజదోషం .......!

యామినికి ప్రస్థుతం వచ్చిన దుస్థితి వినగానే చటుక్కున నాకా విషయం గుర్తొచ్చింది. వాళ్ళది లీగల్ మేరేజి కనక, ఈ దోషం తొలగిపోతుందని ఆశపడ్డాను. కాని నా ఆశ అడియాసేనని ఇప్పుడు తేలిపోయింది కదా!" దు:ఖంతో ఒణికింది ఆయన గొంతుకు. బుజం మీది అంగవస్త్రం కొసతో నెమ్మదిగా కళ్ళు ఒత్తుకున్నారు ఆయన .

"విశ్వనాధం గారికి ఈ విషయం చెప్పావా నాన్నా?"

"ఆ! చెప్పా. ఆనాడు నే నా మాట చెప్పగానే ఆయనకు పూర్తిగా మతి పోయినట్లయ్యింది. ఇక నన్ను మట్లాడనివ్వలేదు. ఆయన. జాతక చక్రాలు గీసిన కాగితాలు నా దగ్గరనుండి తీసుకుని, వాటిని పరపరా చింపి పారేశాడు. " నేను జాతకాలు నమ్మను, నమ్మనుగాక నమ్మ" నంటూ కేకలు పెట్టి, అక్కడ నుండి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ తరవాత మళ్ళీ మామధ్య ఆ ప్రసక్తి రాలేదు."

" మామయ్యా! గ్రహదోషాలకి శాస్త్రోక్తంగా కొన్ని పరిహారాలు ఉంటాయి కదా, అలాంటివేమైనా ఉంటే ఆయనకా సంగతి చెపితే బాగుండీదేమో ..... !"

"అన్ని దోషాలకీ ఉన్నట్లే కుజదోషానికీ పరిహారం ఉందమ్మా! చెప్పాలని నేను ఎంతో ప్రయత్నించా, కాని ఆయన చెప్పనిస్తే కదా! "బుద్ధి: కర్మానుసారిణి" అని ఊరికే అన్నారా! ఆ తరవాత కూడా ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నిస్తే, అన్నిసార్లూ కూడా తనకు జాతకాల మీద నమ్మకం ఏమాత్రం లేదన్నాడు. నిలదీసి అడిగీవాడు లేకపోయాడు గాని, అంత నమ్మకం లేనప్పుడు, అసలు ఆ జాతకం ఆయన నా దగ్గరకు ఎందుకు తీసుకు వచ్చినట్లు, చెప్పు ? అయినా, నేను అర్ధం చేసుకోగలను, తన ప్రియ పుత్రిక విషయంలో అంతటి దుర్వార్త విన్నప్పుడు ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందో!"

మాధవి నొచ్చుకుంది, " మామయ్యా! ఆపరిహారమేదో చేసి ఉంటే యామినికి ఇప్పుడు ఈ కష్టం వచ్చి ఉండేది కాదేమో!"

"వెర్రిపిల్లా! అంతా నీ చేతిలోనే ఉందని నీకు అనిపించవచ్చు, కాని నిర్ణయించేది ఘటనాఘటన సమర్ధుడైన ఆ పైవాడు, మనం కాదు! విధి చేతిలో కీలుబొమ్మలం మనం! నే నెంత ప్రయత్నించినా ఆయనకు చెప్పేవీలు కుదరనే లేదు! అయినా, ఇప్పుడు జరిగిన ఈ అర్దాంతరపు రిజిష్టర్ మేరేజిలో అసలు ఆ పరిహారం చేసే అవకాశమే లేదు కదా!"

" ఔను, నిజమే! అంతా ఆ విధి విలాసం!" అంది మాధవి దేవుణ్ణి తలుచుకుని రెండు చేతులూ చేర్చి నమస్కారపూర్వకంగా.

" అందరికీ తెలిసిన కథ చెపుతా విను - మహాభారతంలోని గాంధారికి కూడా ఉందిట ఈ కుజదోషం! అందుకే, వైధవ్యాన్నుంచి తప్పించడం కోసం ముందుగా ఆమెకు ఒక మేక పోతుతో పెళ్లి జరిపించి, దాన్ని అప్పటికప్పుడు ఖండించి, ఆ తరవాత ఆమెను ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారుట! ఆ విధంగా దోష పరిహారమై, ఆ దంపతులు కలకాలం కలిసి ఉన్నారు. అదే శాఖాహారులైన వాళ్ళు ఆ పెళ్ళిని ఒక అరటి చెట్టుతో జరిపించి, వెంటనే దాన్ని ఖండించి, దోష నివారణ జరిగేలా చేస్తారు. ఇంతకీ చెప్పొచ్చెడిది ఏమిటంటే నమ్మిన వాళ్ళకి రాయిలో దేవుడు కనిపించి వరాలిస్తాడు. నమ్మని వాళ్ళకి రాయి రాయే! "

"ఐతే నాన్నా! అది విధవా వివాహంతో సమానం కాదా? యామిని విషయంలో, సుదర్శనమే ఆ "బకరా" అయ్యా డన్నమాట కదా! అలాగైతే ఈ మాటు......"

"ఉష్" అంటూ, పెదవులపై వేలుంచుకుని, అలా మాటాడొద్దని భర్తను వారించింది మాధవి.

" భవిష్యత్తులో ఏముందో మనకి తెలియదు. ఏది ఏమవ్వాలన్నది, ఆ పరమాత్ముడు ఎప్పుడో నిర్ణయించే ఉంచుతాడు. కాని నువ్విప్పుడలా పొరపాటున కూడా మాటాడ కూడదు బాబూ " అన్నారు సోమయాజులుగారు కూడా మురళీతో .

అంతలో మంచం దిగి కర్ర సాయంతో నడుచుకుంటూ సావడిలోకి వచ్చింది అన్నపూర్ణమ్మ గారు. "ఏమిటి మురళీ! యామిని అంటున్నారు! యామినికి మళ్ళీ ఇప్పుడు ఏమయ్యింది? విశ్వనాధంగారు పోయాక నేను వెళ్ళి యామిన్ని చూసింది లేదు. దాన్ని చూడాలని ప్రాణం పీకుతోంది. లేని ఓపిక తెచ్చుకుని ఎలాగోలా వెళ్ళి చూసి రావాలని ఉంది. ఒకసారి నన్నక్కదకు తీసుకెళ్ళండర్రా" అంటూ ప్రాధేయపడుతున్నట్లు అడిగింది.

"ఎలాగమ్మా! నువ్వు అక్కడి దాకా నడవలేవుకదా!"

"అదంతా నేను చూసుకుంటాలే బావా! సాయంకాలం సైకిల్ రిక్షా రానూ పోనూ ఒకేసారి, కొంచం ఎక్కువ ఇస్తానని చెప్పి మాటాడుకుని, అత్తయ్యను నేను దగ్గర ఉండి, తీసుకెళ్ళి తీసుకొస్తా. సరా" అంది మాధవి.

" సరే ఐతే. ఇదిగో, ఈ సంచీలో సరుకులు వాళ్ళవి. నిన్న సాయంకాలం అక్కడకి వెళ్ళినప్పుడు వకుళ సరుకుల లిస్టు ఇచ్చింది. అన్నీ తెచ్చా. మీరు వెళ్ళీటప్పుడు వీటిని తీసుకెళ్ళి వాళ్ళకు ఇవ్వండి, అవసరమో ఏమో! మర్చిపోవద్దు" అంటూ వెంటనే బట్టలు మార్చుకోడానికన్నట్లుగా తత్క్షణం తన గదిలోకి వెళ్ళిపోయాడు మురళీ.

అతని వెనకాలే తనూ గదిలోకి వచ్చింది మాధవి కూడా. మురళీ, బట్టలు మార్చుకునీ ప్రయత్నమేమీ చెయ్యకుండా, తలపట్టుకుని మంచం మీద కూర్చునివున్నాడు. అతని ముఖంలో దు:ఖం కరడు కట్టి ఉంది. అదిచూసి కలవరపడింది మాధవి.

"ఏమిటిది బావా! ఏమయ్యిందేమిటి? సరిగా చెప్పు" అంటూ అతనికి దగ్గరగా వచ్చింది. "రాత్రి ఎవరో సుదర్శనాన్ని హత్యచేశారని చెప్పా, విన్నావుగా! ఆ హత్య చేయించింది యామినే - అంటున్నాడుట నరహరి, సుదర్శనం గుమాస్తా! ఎంత బాగుందో చూడు! యామిని సుదర్శనం డబ్బుకి ఆశపడి అతన్ని చంపించింది - అమ్తున్నారు. ఆ మాట ఊరంతా గుడ్డిగా నమ్ముతున్నారు! "

మురళీ ఇంకా మాట పూర్తి చెయ్యకముందే, "రామ, రామ" అంటూ రెండు చేతులతోనూ చెవులు మూసుకుంది మాధవి. "నేను నమ్మను. నమ్మను గాక నమ్మను! చీమకైనా అపకారం తలపెట్టని యామిని, ఒక మనిషిని, అందులోనూ భర్తని, అందునా డబ్బుకోసం, చంపించింది - అంటే జనం ఇంత గుడ్డిగా ఎలా నమ్మగల్గుతున్నారు " అంటూ ఆక్రోశించింది.

"మనలాంటి దగ్గరవాళ్ళెవరూ నమ్మడం లేదు. కాని చాలామంది నమ్ముతున్నారు. నాలుక బుజాన్నేసుకుని తిరిగి మరీ ప్రచారం చేస్తున్నాడు ఆ నరహరి. "దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్యండి" అనేవాళ్ళే ఎక్కువున్నారు లోకంలో! ఏమాటైనా సరే, కొంచెం కూడా ఆలోచించకుండా నమ్మేస్తారు అలాంటి వాళ్ళు. నరహరి మాటలవల్ల ఇప్పుడు యామినే ప్రైం సస్పెక్టు! పాపం హౌస్ అరెష్టులో ఉంది. గుమ్మంలో పోలీసు కాపలాగా ఉన్నాడు. చూడగానే మనసు నీరైపోయింది. ఇక అక్కడ ఆగకుండా సామానున్న సంచీ ఇంటికి తెచ్చేశా. ఏ మవసరం ఉందో ఏమో! మధ్యాహ్నం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చెయ్యి.

జింక పిల్లలా ఎంతో చలాకీగా ఉండేది యామిని! శాపగ్రస్తలా, చూస్తూండగా ఇప్పుడు ఎలా దీనంగా మారిపోయిందో చూసి జీర్ణించుకోడం చాలా కష్టంగా ఉంది మాధవీ!. సుచీ, యామినీ నాకు వేరు కాదు. యామిని ఇంతలా దు:ఖపడడం చూసి భరించలేకపొతున్నా. యామిని కష్టాలు చూస్తూకూడా ఏ సాయం చెయ్యలేని నా నిస్సహాయతకు ఏడుపొస్తోంది మాధవీ!" అన్నాడు మురళీ కన్నీళ్ళతో . తన కొంగుతో అతని కన్నీళ్ళు తుడిచింది మాధవి. "బాధపడకు బావా! మంచి వాళ్ళని ఆదుకునే భారం ఆ భగవంతుడిదే! నిరపరాధులకు శిక్ష పడకుండా కాపాడవలసిన వాడూ ఆయనే! యామినికి ఏమీ కాదు, చూస్తూ ఉండు, కొండల్లాంటి కష్టాలు కూడా దైవ సహాయం ఉంటే, క్షణంలో మబ్బుల్లా విడిపోతాయి! నువ్వేం ఇదవ్వకు, యామినిల్;అంటి మంచి మనిషికి అంతా మంచే జరుగుతుందని నమ్ము !

దొద్లో పనసచెట్టు దగ్గర ఉయ్యాలా ఊగుతోంది మినీ, నువ్వు దాని దగ్గరకు వెళ్ళు, నీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. అత్తయ్య ఆకలికి ఆగలేదు, నేను వెళ్ళి, మళ్ళీ మడిగట్టుకుని, వంటింట్లో పని పూర్తిచెయ్యాలి. వెళ్ళనా మరి!" అంటూ భర్తను కూతురు దగ్గరకు పంపించి, తను అక్కడినుండి, మళ్ళీ మడి కట్టుకోడానికి వెళ్ళిపోయింది మాధవి.

* * *

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)