“రోజు రోజుకీ మానభంగాలు శృతిమించి రాగాన పడ్తున్నాయి. దేశతలమానిక నగరం హస్తినలోనే జరిగిన అత్యాచార ఉదంతంలో నేరస్థుడికి ప్రజల అలజడి కారణంగా మెడకి తాడేసి యమపురికి పంపినా, ఆ ప్రజల్లోనే భాగమైన కొంతమంది కామపిశాచులకి శిక్షాభయం లేకుండా పోతోంది. అందుకనే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.”
“మానభంగాలు జరగడానికి ఇదమిత్థoగా కారణమిదీ, అని చెప్పడానికి వీలు లేకుండా పోతోంది. వయసుతోవచ్చే శారీరకమైన సహజగుణం కామసహితమైన కోరిక. దీనికి జాతి, మత, కుల, ప్రసక్తి లేదు. ఉన్నవారికీ, లేనివారికీ వయసు ప్రసాదించే ప్రకృతి వరం కావొచ్చు, లేదా శాపమని కూడా అనుకోవచ్చు.”
“స్త్రీపురుష సమాగమం ద్వారా పునరోత్పత్తి కార్యక్రమానికి ప్రకృతి రూపొందించిన మహామంత్రం పరస్పరాకర్షణ లేదా వ్యామోహం. దానికి నైతికతను ప్రసాదించేది సమాజం ఏర్పరచిన వివాహం. వివాహానికి బాహ్యంగా జరిగే కామక్రీడలు ఇష్టమైతే రాసలీలలు, కాకపోతే రాక్షసలీలలు.”
“నాగరికత సమాజానికి నేర్పిన మొదటి అంశం వస్త్రధారణ. ఆధునికత పేరుతో వస్త్రధారణ రోజురోజుకి విపరీతధోరణులు పోతూండడంతో అవి కవ్వింపు చర్యలుగా మలుచుకొంటున్నాయి. చెప్పిన మాటలు ఒక్కోసారి వికటిస్తాయి. పాపం ఓ పెద్ద పోలిసాఫీసరుగారు ఈ మాటని అని కోరి తద్దినం తెచ్చుకొన్నారు. మహిళా లోకం ఆయనగారి మీద దివి సునామీలా విరుచుకు పడింది. చెన్నై కుంభవృష్టిలా ముంచెత్తింది.”
“పాపం మహిళాలోకాన్నీ నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే వెర్రిమొర్రి వస్త్రధారణ కేవలం సినిమాలకే పరిమితం. బాహుమూలల, నడుమువంపుల, ఊరువుల, ఎదలోయల బహిర్గతాలు, చిత్రవిచిత్రమైన ఉరోజ కంచుకాలూ చలనచిత్ర నాయికలకు కోట్లు సంపాదిస్తున్నాయి. కథాబలం లేక చిత్రాలు డింకీలు కొట్టినా నిర్మాతలకు నాలుగు రాళ్ళు దొరికేవి వీరిమూలానే! ప్రేక్షకుల యావ తీరేదీ వీరిమూలానే! ముంబైలో చలనచిత్రాలకు సంబంధించిన కుడ్యచిత్రాలను పేడముద్దలతో కొట్టి మహిళలు పలుసంధర్భాలలో తమ నిరసనలు తెలియజేసినా ప్రయోజనం లేకపోయింది.”
“అవొచ్చు,కాకపోవచ్చు. కానీ నిత్యజీవితంలో కొంగు, పల్లూలు లాంటి ఆచ్ఛాదనం లేని బాహంతరాలతో, ఊరువులను అతుక్కుని ఉండే జీన్ ప్యాంట్లతో సంప్రదాయక దుస్తులకు సెలవుచీటీలు యిచ్చేస్తోంటే, దాడి చేసే మృగాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.”
“ముంబైలోనూ, హైదరాబాబాద్ లోనూ, బెంగళూరులోనూ ఐటి ఉద్యోగినులమీద వాహనచోదకులు అత్యాచారాలు చేశారు. కేవలం వస్త్రధారణ ఒక్కటే కారణం కాకపోవచ్చు. గుర్రం మీద సవారీ చేస్తూపోయే రాజుగారికి పొలాలలో పనిచేసే పల్లెపడుచుమీద, రాజుగారి తోటలో పనిచేసే రాముడికి రాజకుమారి మీద మనసులు పోయే సంగతి మనకి తెలియంది కాదు. ఇక్కడా అదే సామ్యం చెప్పుకోవాలి. లేకపోతే వేలమీద జీతాలు సంపాదించే స్త్రీలమీద చెప్పలేని కసి కావొచ్చు. ”
“చలన చిత్రాలలో అసభ్య దృశ్యాలను కనక కత్తిరించకపోతే ఇలాంటి నేరాలు పెరిగిపోతాయి.”
“అసభ్యమా? అత్యాచారం దృశ్యాలని కూడా కళాత్మకంగా చూపించేస్తున్నారు. అమ్మడి బొమ్మ ఏడుస్తోన్నప్పుడు కూడా శృంగారం ఒలకపోయకపోతే చిత్రం అడుగు ముందుకు జరగదు. రాలుగాయితనంతో మొరటు లేక ద్వంద్వార్థపు మాటలు లేకపోతే సన్నివేశాలలో ప్రేమ ఉన్నట్టుకాదు. నృత్య సన్నివేశాలలో వంపుల ఊపులూ, నడుముల కదలికలూ లేనిదే అది నాట్యమనిపించుకోవటల్లేదు. ఇదివరలో దేశీభామలు బృందనృత్యాలలో నాయకీనాయకులకు ఆలంబనగా నిలిస్తే, ఇప్పుడు విదేశీ శ్వేతసుందరీమణులచేత రంభల్లాంటి ఊరువులతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్నారు. సరే యిక వానలో నాయికను తడిపి చూపించే దృశ్యాలకి కొదవే లేదు. ఆరబోతలకి అమ్మళ్ళకి కోట్లలో సొమ్ములిచ్చే నిర్మాతలు తమ లాభాలు చూసుకుంటారుకాని, సమాజంలో జరిగే విపరీత పరిణామాలకి జవాబుదారీ వహించరు. కత్తెర అధికంగా వేస్తే సినిమాలు ఆడవు. చిత్ర నిర్మాణాలు తగ్గిపోతాయి. అగ్రనటులకు గోరూడకపోయినా, చలనచిత్ర సాంకేతిక కార్మిక వర్గానికి ఇక్కట్లు ప్రారంభమౌతాయి. వారిని దృష్టిలో ఉంచుకొని కత్తెరలు మొరాయిస్తాయని ఓ సెన్సార్ ఆఫీసరుగారు వివరణ యిచ్చుకున్నారు. ఆకుపచ్చ చీరమీద కాషాయిరంగు పూలుంటే అది అభ్యంతరకరమైన దృశ్యంగా కత్తిరించబద్తుంది కాని, కాలేజీకి వెళ్ళే అమ్మాయి చిరుగుల పొట్టిలాగుతో, నాభి ప్రదర్శనతో ఉంటే మట్టుకు కాదు! కాలేజీలకి విద్యార్థినులు నిజంగా అలా వెడ్తున్నారా అంటే, ఖచ్చితంగా కాదు.”
“వయసొచ్చిన అమ్మాయిల వస్త్రధారణ సంగతటుంచు. అయిదేళ్ళ పాపలుకూడా బలాత్కారాలకి గురైపోతున్నారే, దీనికేమంటావు?”
“నడివయసు తారలు కూడా పాపల్లా పొట్టిగౌనులు తొడుక్కుపోతూంటే, ఆ పెద్ద పాపలు చిటారికొమ్మన మిఠాయి పోట్లాల్లా కవ్విస్తోంటే, అభం, శుభం తెలియని చిన్న అమ్మాయిలమీద పంజాలు విసురుతున్నారు. సభ్యసమాజానికి తలవంపులు తెచ్చే ఈ పైశాచిక ప్రవృతిని ఏమనాలో తెలియట్లేదు.. కక్షసాధింపు ఓ కారణం కావొచ్చు. లేదా పసిపాపలతో సంగమిస్తే సుఖరోగనివృతి అవుతుందనే మూఢనమ్మకం కావొచ్చు. యువతీ యువకుల నీలిచిత్రాలు విశృంఖలంగా ఓ పక్కన వెలువడుతోంటే, అవి చాలవన్నట్టుగా అంతర్జాతీయంగా చిన్నపిల్లలతో చిత్రీకరించబడిన నీలిచిత్రాలు కూడా అంతర్జాలంలో విచ్చలవిడిగా ప్రసారమౌతున్నాయి. ఇదీ ఓ ఆధునిక సమాజరీతి అనుకొని గొర్రెలు కూడా తోడేళ్లై ప్రవర్తిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ విషయమై కాకపోయినా ఎవరికిష్టమైన అంశాన్ని వారు యధేచ్చగా చూసుకోవడానికి అభ్యంతరాలుండకూడదని, అంతర్జాలంమీద నిబంధనలుండగూడదని యువత వెర్రికేకలు పెడ్తోంది.”
“‘ఆదికాలం నుంచి ప్రపంచ వ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో జరిగే ప్రతి మానభంగానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటే అది సాధ్యం కాని పని. దీనికింత రాజకీయ రాద్ధాంతం చేయడం అవసరమా?’ అని ఓ తలపండిన రాజకీయ నాయకుడు ఉద్ఘాటించి, అటుపై తగిలిన విమర్శనాస్త్రాలని తన మొద్దు చర్మంతో విరిచి పారేశాడు.”
“త్రేతాయుగంలో రావణుడు సీతని అఫహరించాడే కానీ హద్దుమీరలేదు. ద్వాపరయుగంలో కౌరవులు, ద్రౌపదిని వస్త్రహీనను చెయ్యడానికీ, కీచకుడు మానభాగం చెయ్యడానికీ ప్రయత్నించారు. మరి కలిలో ధర్మం ఒంటిపాదం మీద నడుస్తూంటే ఇలాంటి ఘోర కలిలు జరగకుండా ఎలా ఉంటాయి?”
“ ఇంద్రుడు అహల్యను చెరిచింది కృతయుగంలో కదా? గురుపత్నిని వలచిన చంద్రుని ఉదంతం ఏ యుగంలో జరిగింది? అంచేత ఈ యుగాలూ, పురాణాల మాట అటుంచి ఆలోచిస్తే, మౌలికంగా ఈ కామ పిశాచమనేది మానవుల్లోని కొన్ని పైశాచిక జన్యువుల ప్రభావం అనుకోవాలి. రాజకీయ నాయకుడు అన్న మాటలు సత్యదూరాలు కాకపోవచ్చు.”
“ ఇదివరలో కొవ్వలి, జంపన, చలం సాహిత్యాలు అశ్లీల సాహిత్యాలుగా పరిగణించబడ్డాయి. మరి యిప్పుడో...?”
“ నట్టింట్లో బుల్లితెరమీది దృశ్యకావ్యాల ముందు అవి ఏపాటి? ప్రకటనల్లో సుందరీమణుల, ప్రసార నిర్వహణలు చేసే లంగరు యువతుల ఆహార్యాలతో నిర్మాతలు యువతను రెచ్చగొడ్తున్నారు. ఇది వరకు సినిమా పత్రికలు ప్రత్యేకంగా వచ్చేవి. ఇప్పుడు దినపత్రికల్లోనూ సినిమా వార్తలకి, చిత్రాలకి ప్రత్యేకంగా ఓ పేజీ కేటాయించబడ్తోంది. వారపత్రికల ముఖపత్రాల చిత్రాలు కేవలం సినీతారలవే! లోపలి పేజీల్లో కనీసం రెండుమూడు పేజీలకొక సినిమాతార చిత్రం, దానికి జోడించి మసాలా వ్యాఖ్యలు సామాన్యమైపోయాయి.”
“నిర్మాతలే కారణమని అనకూడదు. అటువంటి ఆహార్యాలని సమ్మతిస్తున్న స్త్రీలు కూడా కారణం కాదా? చదువుతున్న పాఠకులు, చూస్తున్న ప్రేక్షకులు నిరసించకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడమూ కారణమే.”
“ఈ మాటంటే మళ్ళీ స్త్రీల ఆగ్రహానికి గురౌతాం. సంసారంలో సొగసులు చూడగలమా అనుకుంటూ పురుషులు కూడా గమ్మునుండిపోతారు. పురుషుల్లోని సౌందర్యారాధనని రెచ్చగొట్టే విధంగా తారల్ని కళ్ళు జిగేల్ మనిపించేటట్టుగా తెరమీద తీర్చిదిద్దితున్నారు. వివాహిత ప్రేక్షకుల విషయం వదిలేస్తే వారికున్న వెసులుబాటు వేరు. కానీ విద్యార్థులమీద చలన చిత్రాల ప్రభావం ఏ దారి పడ్తుందో చెప్పడం కష్టం.”
“ ముంబై లో పదోక్లాసు చదివే నలుగురు విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతోన్న ఓ విద్యార్థినిని చెరిచారని పత్రికల్లో వార్త. పదోక్లాసు కుర్రాడు ఓ ఆంటీ వద్దకుపోయి, మూత్రం పచ్చగా వస్తోంది, ఇదేం రోగం అని పత్రికల్లో వైద్యసలహాలిచ్చే శీర్షికలకీ ప్రశ్నలు పంపడం – యివన్నీకూడా చుట్టూ విస్తరిస్తున్న కొత్త సంస్కృతి ప్రభావాలే. వయసు దానంతట అదే నెమ్మదిగా ప్రభావం చూపుతున్నంత కాలం విద్యపట్ల, బ్రతుకుతెరువుపట్ల లక్ష్యసాధన చెయ్యగలుగుతారు.”
“అదీ కాక, అర్థరాత్రివేళ మగ స్నేహితులతో తిరక్కండి, పబ్బుల్లో వెంపర్లాడకండి, రెచ్చగొట్టే విధానంగా వస్త్రధారణ చేయకండి, బలాత్కారలనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని సలహాలిస్తారే కాని బలాత్కారాలు చెయ్యడం మంచిదికాని ఎవరూ చెప్పరే !”
“ బలాత్కారం జరిగిందని చెప్పడానికి చాలామంది గౌరవప్రతిష్టలు ఎక్కడ గంగలో కలిసిపోతాయేమోనని ముందడుగు వెయ్యరు. ఆర్నెల్లు కలిసి తిరిగో, సహజీవనం చేసో అటుపైన బలాత్కారం కేసులు బనాయించిన ఉదంతాలూ చోటు చేసుకొంటున్నాయి. అయితే వెనువెంటనే బలాత్కారాలను గురించి బహిర్గతం చేసినవారికి న్యాయస్థానాలు ఏడాది తర్వాత తీర్పునిచ్చి, దోషులకు శిక్షలు విధించడం బలాత్కారం చెయ్యడం తప్పని చెప్పడమే కదా? అలాగని బలాత్కారం చేసినవాడికి వెంటనే బడిత పూజచెసి ఎవరైనా ఎముకలు విరగ్గొడితే అది చట్టవిరుద్ధమని వాళ్లమీద కేసులు బనాయిస్తారే! తాళికట్టిన స్త్రీ అభీష్టానికి వ్యతిరేకంగా భర్త ప్రవర్తించినా అది బలాత్కారంకిందే లెక్కని ఆ మధ్య ఓ మీమాంస జరిగింది. నిర్ణయం ఏం జరిగిందో తెలియదు.?”
“ ‘పాపం పదిహేడేళ్ల (పదహారేళ్ళ) కుర్రాడు తెలియకచేసిన పాపం. కార్బైడ్ ప్రభావానికి పచ్చికాయలు మగ్గినట్లుగా, అనేకానేకమైన ఆధునిక పరిసర ప్రభావలవల్ల ముందే పెద్దవాడైపోయి, మతి చెడి పొందు కోసం పరుగులు తీశాదు, క్షమార్హుడు,’ అని చట్టసభలే నిర్ణయం తీసుకొంటే ఏమనుకోవాలి?”
“ కుర్రాళ్లనే ఎందుకనుకోవాలి? పచ్చని సమాజాన్నేకుళ్లబెట్టేస్తున్నాయి!” .
“సరే,పద! ఎండిపోయిన ఈ ఉద్యానవనంలో విరిగిపోయిన సిమెంట్ బెంచిల మీద కూర్చుని మాట్లాడుకొంటున్న మన మాటల్ని ఏ కుర్రవెధవాయిలైనా వింటే, ‘వయసుమీరిన వెధవాయిలు మనమీద పడి ఏడుస్తున్నార’ని అపహాస్యం చేస్తారు!”
***