ఆళ్వారుల అచంచలమైన భక్తిని తెల్పే చిన్నికథని వివరిస్తాను.
“ ఒక వర్షాకాలం రాత్రి ఒక్కరు మాత్రం నిదిరించడానికి సరిపోయే గదిలో పూదత్తాళ్వార్ భగవన్నామాన్ని స్మరిస్తూ పడుకొని ఉంటారు. బైట వాన పడతూ ఉంటుంది. అక్కడికి పోయిగైయాళ్వార్ వచ్చి పంచలో నిలబడతారు. పూదత్తాళ్వార్ వారిని చూసి “ స్వామీ వానకి తడిసి పోతున్నారు లోపాలకి రండి ఇద్దరం కూర్చోవచ్చు” అని ఆహ్వానిస్తారు. యిద్దరు కూర్చొని భగవన్నామాన్ని జపిస్తూ ఉంటారు. అక్కడికి పేయాళ్వార్ వస్తారు. “ముగ్గురం నిలుచుంటే గది సరిపోతుంది, లోపలకి రండి” అని పిలచి ముగ్గురూ నిలబడతారు. కొద్దికాలానికి గదిలోకి నాల్గవ వ్యక్తి వచ్చినట్లు ఇరుకుగా అనిపిస్తుంది కాని ఎవరు కనబడరు! ఇదేమి వింత! అని ముగ్గురూ అనుకొంటూ వుంటే, అపుడు అద్భుతంగా అక్కడ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై “ముగ్గురు భాగవతోత్తములు ఒకచోట చేరేరు, మిమ్మలను దర్శించుకోవాలని నేను వచ్చేను” అని చెప్పి భక్తవరదుడైన ఆ స్వామి కరుణాంతరంగానికి ప్రణమిల్లి “కండేన్ కండేన్” మిమ్ము చూసేము, చూసేము అనే పాశురాలతో ముగ్గురూ కీర్తిస్తారు.
మధుర భక్తికి తార్కాణం ఆళ్వారుల దివ్య చరితం.
అట్టి ఆళ్వారులలో తెలుగు వారి హృదయాలలో నిలిచిన గోదాదేవి(ఆండాళ్) చరిత్రను తెల్పే ‘ఆముక్తమాల్యదను’, విప్రనారాయణ చరిత్ర (తొండరడిప్పొడియాళ్వార్ ) తెలిపే ‘వైజయంతీ విలాస’ కావ్యాన్ని క్లుప్తంగా పరిచయం చేస్తాను.
భక్తుల హృదయమనే భూములలో భక్తి అనే కేదారాలను పండించి భగవద్భాగవత కైంకర్యం చేసిన పవిత్ర మూర్తి గోదాదేవి. స్త్రీ మూర్తి అయిన గోదాదేవి భగవంతుని తానే స్వయంగా మేల్కొలిపి, పూమాలలతో, పామాలలతో( పాటలు అనే మాల) స్వామిని బంధించి తనవానిగా చేసుకొని,తనను తాను అర్పించుకొన్న పుణ్య చరిత. ఆండాళ్ అనబడే గోదాదేవి. ఈమెనే శ్రీకృష్ణదేవరాయలు “ఆముక్తమాల్యద” అని సంబోధించి ఆ పేరుతో అద్భుతమైన కావ్యాన్ని రచించేడు. ఆండాళ్ తల్లి రచించిన “తిరుప్పావై” అనే ముప్పది పాశురాలని (పాశురం అనగా పాట అనిఅర్ధం) ధనుర్మాసంలో విష్ణ్వాలయాలలో ఇప్పటికి సేవాకాల రూపంలో పారాయణ చేస్తారు. మధుర భక్తికి నిదర్శనంగా నిలిచే ద్వాపర యుగ వ్రజగోపికలు శ్రీకృష్ణుని పొందగోరి “ కాత్యాయని” వ్రతాన్ని ఆచరించి ఆ స్వామిని పొందేరో, అట్లే కలియుగంలో గోదాదేవి కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, శ్రీహరిని తనవానిగా చేసుకొన్నపుణ్య మూర్తి. ఆ స్వామికి సమర్పించే మాలలను తాను ముందుగా ధరించి స్వామికి సమర్పించినది. అందుకే ఆమె ‘ఆముక్తమాల్యద’ అయింది. పరమ భక్తుడైన విష్ణుచిత్తునకు తులసివనంలో అయోనిజగా లభించినది. పెరియాళ్వార్ గా పిలవబడే విష్ణుచిత్తుడు ఎంతటి పరమ భక్తుడో ఈ కథ మనకి వివరిస్తుంది.
“ శ్రీవిల్లిపుత్తూరులో ఉండే శ్రీహరి పేరు ‘ మన్ననార్’ విష్ణుచిత్తుడు ఆ స్వామికి పుష్పమాలలు సమర్పించి ఆరాధిస్తూ ఉంటారు. తన భక్తుని గొప్పవానిగా చూడదలచి, “ పాండ్య రాజ సభకు వెళ్లి, పరతత్త్వ నిర్ణయ వాదనలో పాల్గొని శ్రీమన్నారాయణుడే పరదైవమని వాదించి విజయం పొంది, రాజు ఏర్పాటు చేసిన వాద శుల్కాన్ని (ధనాన్ని) పొందమని” ఆజ్ఞాపిస్తాడు.
అపుడు పెరియాళ్వార్ శ్రీహరితో ఇలా విన్నవిస్తాడు ---
“ స్వామీ నన్ను నితఃపురా పటిత శాస్త్ర గ్రంథ జాత్యంధు నా
రామక్ష్మాఖనన క్రియా ఖర ఖనిత్ర గ్రాహితోద్యత్కిణ
స్తోమాస్నిగ్ధకరున్ భవత్ భవన దాసున్ వాదిగా బంపుచో
భూమి భ్రుత్ సభ నోటమైన నయశంబుల్ మీకు గాకుండునే”
“స్వామీ! అక్షరం ముక్కరాని నేను ఆ పండిత సభకు వెళ్లి వాదనలో ఓడిపోతే ఆ అపకీర్తి మీకు కాదా!? నన్ను –
“ గృహ సమ్మార్జమో జలాహరణమో శృంగార పల్యంకికా
వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్య లభ్యధ్వజ
గ్రహణంబో వ్యజనాతపత్రధృతియో ద్రాగ్దీపికారోపమో
నృహరీ వాదములేల లేరే యితరుల్నీలీలకున్ బాత్రముల్”
“ ఓస్వామీ! నన్ను ఇల్లు తుడవమనో, నీళ్ళు తేమ్మనో నీపల్లకీ మోయమనో,పూల మాలలు తయారు చేయడం వంటి పనులు చెపితే చేస్తాను కానీ, వాదనలు నేను చేయలేను, వేరొకర్ని పంపు” అని పలకిన విష్ణుచిత్తునీతో శ్రీహరి “అంతా నేను చూసుకొంటాను, నీవు పాండ్యరాజు సభకు వెళ్ళు” అని ఆజ్ఞాపించగా ‘అలాగే వెళ్తాను’ అని బయలు దేరుతాడు.
( సశేషం)