కథా భారతి - అనగనగా ఓ కథ
సగటు మనిషి
- వాణిశ్రీ

కృష్ణమూర్తి ఆఫీసుకు వెళ్తూ, వెళ్తూ ఆ దృశ్యం చూసి ఆగిపోయాడు. ప్రైమరీ స్కూలు ముందు ఆవరణలో ఇద్దరు కుర్రాళ్ళు కొట్టుకుంటున్నారు.

వారికి పదేళ్ళ వయస్సుంటుదేమో. అందులో ఒకడు లావుగా, ఎర్రగా దొరబాబులా వున్నాడు. రెండోవాడు నల్లగా, అమాయకంగా, దరిద్రదేవత కొడుకులా వున్నాడు.

కృష్ణమూర్తి చూస్తుండగానే ఆ ఎర్రటి కుర్రాడు, నల్లటి కుర్రాడ్ని కొట్టి పడేశాడు. వాడి పెదవి చితికి నెత్తురు కారుతోంది. వాడు అసహాయంగా ఏడుస్తూ తిడుతున్నాడు. చుట్టూ వున్న పిల్లలు వినోదం చూస్తున్నారు.

కృష్ణమూర్తికి ఆ నల్లటి కుర్రాడి మీద జాలివేసింది. ఆ ఎర్రటి కుర్రాడి మీద కోపం వచ్చింది. గబగబా వెళ్ళి ఇద్దర్నీ విడదీశాడు.

"ఎందుకోయ్: వాడ్ని కొడుతున్నావ్?" అన్నాడు దబాయిఁపుగా.

"నన్ను తిట్టాడండీ," అన్నాడు ఎర్రటి కుర్రాడు.

"ముందు నన్ను ’నల్లకోతి’, ’నల్ల కోతి’ అని ఎగతాళి చేశాడండీ," అన్నాడు నల్లటి కుర్రాడు ఏడుస్తూ.

హెడ్‍మాష్టారు రామాచారి కృష్ణమూర్తికి బాగా తెలిసినవాడే. ఆయన అంతా విని ఆ ఎర్రటి కుర్రాడ్ని కేకలేసి, నల్లటికుర్రాడిని ఓదార్చి, ఇంకెప్పుడూ కొట్టుకోగూడదని బుద్ధిచెప్పి పంపించాడు.

"అన్యాయం మాష్టారూ : ఆ ఎర్రటి కుర్రాడు వట్టి పొగరుబోతులా వున్నాడు. నాలుగు తగలనియ్యాల్సింది." అన్నాడు కృష్ణమూర్తి.

"పోనీలే కృష్ణమూర్తీ : పిల్లలు. తిట్టుకుంటూవుంటారు. కొట్టుకుంటూ వుంటారు. మళ్ళీ ఒకటైపోతారు గూడా. మనం చూసీ, చూడనట్లు పోవాలి," అన్నాడు హెడ్‍మాష్టారు నవ్వుతూ.

కృష్ణమూర్తి నవ్వలేదు. ఎర్రటి కుర్రాడిమీద కోపం తగ్గనేలేదు. ఎవరో బాగా డబ్బున్న బాబులా వున్నాడు. అసలు వాడి పొగరంతా డబ్బుందనే. ఇలా చూసీ, చూడనట్లు పోతే లాభం లేదు. మళ్ళీ, మళ్ళీ ఏడిపిస్తూనే వుంటాడు. కొడుతూనే వుంటాడు.

పాపం ఆ నల్లటి కుర్రాడు ఏం చెయ్యగలడు. వాళ్ళ నాన్న కూలీనో లేక రిక్షా తొక్కే మనిషో అయివుంటాడు. కొడుకుని చదివించడమే గొప్ప విషయం. ఇక వీడు తగువులు తీసుకొస్తే? అసలా చదువే వద్దని, బడి కాస్తా మాన్పించి ఏ చిల్లర కొట్లోనో, లేక ఏ వర్కుషాపుకో తోసేస్తాడు, అనుకున్నాడు.

"అలా పోనిస్తే లాభంలేదు మాష్టారూ : గట్టిగా బుద్ది చెప్పాలి మళ్ళీ పొగరుమోతుతనం చూపించకుండా, మీదపడి పిల్లల్ని కొట్టకుండా చెయ్యాలి" అన్నాడు కృష్ణమూర్తి.

"ఏం చెయ్యాలంటావు?" అన్నాడు హెడ్‍మాష్టారు.

"వాళ్ళ నాన్నని పిలిపించి చెప్పండి. ఆయనే బాగా తగలనిస్తాడు," అన్నాడు కృష్ణమూర్తీ :"

"ఒక పని చేస్తావా కృష్ణమూర్తీ:"

"ఏమిటో చెప్పండి."

"వాళ్ళ నాన్నగారి దగ్గరికి నువ్వే వెళ్ళి చెప్పు. పాపం తన్నులు తిన్నాడే కుర్రాడు వాడిని గూడా వెంట తీసుకెళ్ళు. బాగుంటుంది." అన్నాడు హెడ్‍మాష్టారు.

"అలాగే : వాళ్ళ నాన్న ఆడ్రసు చెప్పండి" అన్నాడు పెన్ తీసి.
హెడ్‍మాష్టారు చెప్పాడు.
కృష్ణమూర్తి ముఖం నల్లగా మాడిపోయింది. అతను అడ్రసు రాసుకోలేదు. పెన్ ముడిచి జేబులో పెట్టుకున్నాడు.

"ఆయనా, ఆ కుర్రాడి నాన్నా?" అన్నాడు వెల, వెలా పోతూ.

"మీకు తెలుసా?"
"ఆయనే మా ఆఫీసరు," అన్నాడు కృష్ణమూర్తి నెమ్మదిగా.
"అలాగా."
"ఆఫీసు టైమైంది. వెళ్ళొస్తాను సార్," అని లేచి గబగబా వెళ్ళి పోయాడు కృష్ణమూర్తి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)