నారద మహామునికి ఆ రోజు ఏమీ తోచటం లేదు.
ఎవరికైనా తంపులు పెడదామనుకుంటే, కనుచూపు మేరలో ఎవరూ కనపడలేదు.
ఇటు వైకుంఠానికి వెడితే, అక్కడ శ్రీమహావిష్ణువు ఆదిశేషు మీద పడుకుని మహానిద్రలో వున్నాడు. ఎలాగూ నిద్రపోతున్నాడు కదా అని, శ్రీమహాలక్ష్మి ఆయన కాళ్ళు వత్తటం మానేసి, ఎక్కడికో వాహ్యాళికి వెళ్లినట్టుంది, అక్కడ లేదు.
అక్కడే పద్మంలో పద్మాసనం వేసుకు కూర్చుని బ్రహ్మదేవుడు హడావిడిగా, ఆరోజు పుట్టబోయే వారికి అందరికీ జాతకాలు వ్రాస్తున్నాడు. నాలుగు తలలతో ఆలోచిస్తూ, ఎనిమిది చేతులతో చకాచకా వ్రాస్తున్నాడు. ఎప్పుడూ ఆయనకు దగ్గరగా తన్మయత్వంతో వీణ వాయిస్తూ కూర్చునే సరస్వతీదేవి మరెక్కడికి వెళ్ళిందో కానీ, అప్పుడు అక్కడ లేదు. బ్రహ్మగారి పనికి అడ్డం రావటం ఇష్టం లేక నారదుడు అక్కడినించీ కైలాసానికి వెళ్లాడు.
పరమశివుడు ఒక్కడే, కొండ మీద ఒళ్ళు మరచి తాండవ నృత్యం చేస్తున్నాడు. అక్కడ కూడా ఆయన ఒక్కడే వున్నాడు. పార్వతీదేవి మరెక్కడికి వెళ్ళిందో కానీ, ఆ సమయంలో అక్కడలేదు.
ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక నారదుడు, అలా మేఘాల మీద నడుస్తూ అక్కడే వున్న ‘మరో ప్రపంచం’ వైపు దారితీశాడు.
అప్పుడే చూశాడు, కొంచెం దూరంలో ఆయనకి ముందుగా లక్ష్మీ, సరస్వతీ, పార్వతులు ముగ్గురూ కలిసి, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాహ్యాళికి ఆ మరో ప్రపంచం వేపే వెడుతున్నారు.
వారిని చూడగానే, నారదుడికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
వారిని అందుకోవటానికి గబగబా అడుగులు వేసి, వాళ్ళని చేరుకున్నాడు.
‘అమ్మలందరికీ నా నమోవాకాలు!’ అన్నాడు.
“ఏమిటి నారదులవారు ఇలా వచ్చారు?” అడిగింది ఆదిశక్తి ఆశ్చర్యపోతూ.
“ఏమీ తోచక ఇలా వచ్చాను. ఈ మరో ప్రపంచం పేరు విన్నానే కానీ,
ది స్వర్గమో తెలీదు, నరకమో తెలీదు. ఇక్కడ ఎలాటి వారు వుంటారో చూద్దామని ఇలా వచ్చాను” అన్నాడు నారదుడు.
శ్రీశ్రీ బ్రహ్మగారు కొత్తగా నిర్మించిన ఆ మరో ప్రపంచం గురించి తనకి బాగా తెలుసు కనుక, భారతీదేవి ఇలా అంది. “ఇది స్వర్గమూ కాదు, నరకమూ కాదు. అంతేకాదు ఇదే స్వర్గమూ, నరకమూ రెండూనూ. ఎవరి ప్రవర్తననిబట్టి, కర్మనిబట్టి, వారు తమతమ జీవితాలని ఇక్కడ స్వర్గమయం చేసుకోవచ్చు, నరకయాతన పడవచ్చు. దీనిని ఈమధ్యనే ఒక చిన్న ప్రయోగం కోసం సృష్టించారు. ఇటు స్వర్గం నించీ, అటు నరకం నించీ కొంతమందిని ఇక్కడికి తీసుకువచ్చారు. వారు ఈ మరో ప్రపంచంలో ఎలా ప్రవరిస్తున్నారో చూద్దాం!”
నారదుడు చటుక్కున తలెత్తి, వింతగా చూశాడు.
“రా నాయనా... మాతోపాటూ రా.. చూద్దాం అక్కడ ఎలా వుందో.. మనం వాళ్ళెవరికీ కనపడము. కానీ వాళ్ళని మనం చూడవచ్చు, వినవచ్చు. అంతేకాదు వాళ్ళ మనస్సులో ఏముందో కూడా చదివేయ వచ్చు“ అంటూ దారి చూపింది లక్ష్మీదేవి.
అక్కడ చక్కటి సరోవరం వుంది. మలయ మారుతం చల్లగా ముంగురులను తాకుతూ ఆహ్లాదంగా వుంది. సరోవరం చుట్టూ ఎన్నో విరగబూసిన పూల మొక్కలతో మనోహరంగా వుంది.
అక్కడే ఒక కవిగారు కూర్చుని తను వ్రాసిన ‘మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచింది’ అని ఆవేశంగా కవితాగానం చేస్తున్నారు. ఎంతోమంది ఆ కవితాగానాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇంకొక భావకవి, “ద్వేషం మోసం లేని సీమలో.. ” అని ఇంకొక కవిత చదువుతున్నారు.
కొంచెం పక్కనే “మందార మకరంద మాధుర్యమును తేలు.. ” అని తను వ్రాసిన మృదుమధుర పద్యకావ్యాన్ని ఆలాపిస్తున్నాదు ఇంకొక కవి.
అక్కడే గులాబీ పూల మొక్కల దగ్గర ఎంతో గొప్ప రచయితలూ, కవులూ కూర్చుని భారతదేశంలోనే ఎంతో గొప్పదైన తేనెలూరు తెలుగు సాహిత్యాన్ని మధురస్మృతుల్లో తలుచుకుంటూ, అందరితో పంచుకుని ఆనందిస్తున్నారు.
అక్కడ వున్న పచ్చగడ్డి మీద బాసింపట్టు వేసుకుని, ఒళ్ళో ఒక చెక్క పెట్టుకుని, ఎంతో అందమైన బొమ్మలు గీస్తున్నాడు ఒకాయన. ఆయన పక్కనే గడ్డి మీద పడుకుని తను వ్రాసిన ఒక హాస్య కథను వినిపిస్తున్నాడు ఆయన గాఢ మిత్రుడు. చుట్టూ ఎంతోమంది కూర్చుని, పొట్టలు చేతితో పట్టుకుని పెద్దగా నవ్వుతూ తమ సంతోషం ఆపుకోలేకపోతున్నారు.
కవితా సరస్వతి మనసంతా ఆ సాహిత్య సౌరభాలతో పులకరించింది.
ఆ సరోవరం ఒడ్డునే, ఇంకొక పక్క ‘శివశంకరీ.. శివానందలహరి’ అని తన కంచు కంఠంతో మధురంగా పాడుతున్నాడు ఒక గాంధర్వ గాయకుడు. ఆయన చుట్టూ కూర్చున్నవారందరూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుని తలలు వూపుతూ స్వర్గలోకం చూస్తున్నారు. కొందరి కళ్ళల్లో ఆ గంధర్వ గానానికి ఉద్వేగంతో ఆనంద భాష్పాలు తొణికిసలాడుతున్నాయి.
శివశంకరి అక్కడే ఒక్క క్షణం ఆగి, ఆ మధుర గానాన్ని మెచ్చుకుంటూ తల వంచి తన గౌరవం ప్రదర్శించింది.
అలాగే ఇంకొక పక్క ఒకాయన త్యాగరాజ కీర్తనలు శ్రావ్యంగా ఆలాపిస్తున్నాడు. అక్కడ కూర్చున్న వారందరూ ఒక చేత్తో రెండవ చేతి మీద తాళం వేస్తూ, ఆ సంగీత సాగరంలో ముణిగిపోయి వున్నారు.
ఆ పాటలో రామనామం వింటూ పొంగిపోయింది సీతామహాలక్ష్మి.
అక్కడే పచ్చగడ్డి మీద తమ అందెల రవళికి అనువుగా మృదుమెత్తని అడుగులు వేస్తూ, కూచిపూడి నృత్యాన్ని చేస్తున్నారు ఎందరో అపురూప నృత్య కళాకారులు.
సరోవరానికి అవతలివైపు కొందరు చలనచిత్ర మహామహులు కూర్చుని, ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకి తెచ్చుకుని మురిసిపోతున్నారు. ఒక మహానటుడు ఘటోత్కచుడి సంభాషణలు సరదాగా చెబుతుంటే, పక్కనే వున్న నాయకీ నాయకులు ఒకళ్ళనొకళ్ళు చిరునవ్వుతో తమ కళ్ళతోనే పలకరించుకుంటున్నారు. నటులతోనూ, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, రచయితలతోనూ ఎంతో సరదాగా వుంది అక్కడ వాతావరణం.
సరస్వతీదేవి ఎంతో గర్వంగా తల ఎగరేస్తూ, “తెలుగునాట చిత్ర, చలనచిత్ర, నృత్య, సంగీత సాహిత్యాలకు స్వర్ణ యుగం అది! అంత గొప్పరోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో” అంది.
“మా తండ్రిగారినే అడగరాదా, తల్లీ!” అనుకుందామనుకోబోయి, వీణాపాణికి తన మనసులోని మాట తెలిసిపోతుందని, అలా అనుకోవటం విరమించుకున్నాడు నారదుడు.
ఆ సరోవరం ఒడ్డునే ఇంకొక పక్క కొందరు కూర్చుని మాట్లాడుతుంటే, ఎంతోమంది నిశ్శబ్దంగా కూర్చుని వింటున్నారు. మధ్యమధ్యలో చప్పట్లు కొడుతున్నారు. ఆ మాట్లాడేవారంతా భారతదేశ స్వాతంత్ర సమరంలో దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులు. పరదేశీయులని ప్రాణాలు ఒడ్డి ఎలా ఎదుర్కొన్నదీ చెబుతుంటే, అక్కడ కూర్చున్న ప్రేక్షకులకి ఒళ్ళు జలదరిస్తున్నది. కళ్ళు చెమర్చుతున్నాయి. కొంతమంది లేచి వారి పాదాలకు నమస్కారం చేస్తున్నారు.
అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చాక, ఎలా దేశ నిర్మాణ కార్యక్రమంలో నిస్వార్ధంగా పాల్గొన్నారో తెలిసిన వారు, వారి పక్కన కూర్చుని వారి అనుభవాలు వింటున్నారు.
శక్తి స్వరూపిణి భవానీదేవి వారి వేపు ప్రేమగా చూసి ముందుకు కదిలింది.
కొంచెం ఇవతలగా గురుకులంలాగా వుంది. ఎంతోమందికి చదువులే కాక జీవితంలోని విలువలతో సహా విద్యాదానం చేసిన గురువులు, వ్యక్తిత్వ వికాసంలో పాఠాలు చెబుతున్నారు. పుస్తకాలు కాగితాలతో బట్టీయం వేయకుండా, చిన్నా పెద్దా - విద్యార్ధులందరూ అర్ధం చేసుకుంటూ శ్రద్ధగా వింటున్నారు.
చదువులరాణి నిట్టూరుస్తూ అంది, “ఎన్నాళ్ళయినందో ఇలాటి సమర్ధులైన పంతుళ్ళనీ, శ్రద్ధగా వినే విద్యార్ధుల్నీ చూసి!” అని.
“పదండి ముందుకి.. ముందుకి వెడదాం” అన్నాడు నారదుడు ముందుకి నడుస్తూ.
కొంచెం ముందుకి వెళ్ళి అక్కడే ఆగిపోయారు అందరూ.
అది ఒక పెద్ద అడవిలా వుంది. ఎన్నో చెట్లు వున్నాయి. కానీ చాల చెట్లు ఎండిపోయాయి. ఆకులు అన్నీ రాలిపోయాయి. ఎన్నో కొమ్మలు విరిగి క్రింద పడిపోయి వున్నాయి.
“అదేమిటి.. ఇక్కడ ఇలా వుంది..” అన్నది శ్రీమహాలక్ష్మి, కొంచెం బిత్తరపోతూ.
“ఇందాక మనం చూసిన ప్రదేశంలాగానే వుండేది ఇది కూడా. కానీ అక్కడ వాళ్ళు దాన్ని అందమైన నందనోద్యానవనంలా మార్చుకుని, స్వర్గతుల్యం చేసుకుని, కళామయ జీవితం గడుపుతూ ఆనందిస్తున్నారు.
ఇక్కడ వున్న వారు స్వార్ధంతో, అసూయా ద్వేషాలతో, ఇలా భూమి కబ్జాలు, దొంగతనాలు, హత్యలతో దీన్ని పూర్తిగా మార్చేసి ఇలా చేసుకుంటున్నారు. కొంచెం ముందుకు వెడితే మీకే తెలుస్తుంది. పదండి” సరస్వతి ముందుకు నడుస్తూ అన్నది.
అక్కడ ఒక మోడువారిన చెట్టు క్రింద ఎండ ఎక్కువగా వుంది. అక్కడ ఎంతోమంది మనుష్యులు కూర్చుని, నుంచుని, వంగుని, పడుకుని – వారి వారి ఒళ్ళంతా గోక్కుంటున్నారు. కొందరికయితే గోకిన చోటల్లా రక్తం కారుతున్నది. ఆ రక్తం, చీమూ వున్నచోట ఈగలూ దోమలూ వాలుతున్నాయి. కొందరికి ఒళ్ళంతా వాచిపోయి వుంది. అక్కడ ఒక రకమైన దుర్వాసన కూడా వేస్తున్నది.
అది చూడలేక భూదేవి గబగబా ముందుకు నడిచింది.
“ఏమిటి, ఇక్కడ ఇలా వుంది?” అడిగింది పార్వతీదేవి, చీరకొంగుతో ముక్కు మూసుకుంటూ.
నారదుడు, “ఇదేమిటో నాకు తెలుసు తల్లీ! ఇప్పుడు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాదిన వున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుల గజ్జి ఎక్కువగా వుంది. ఇది ఆ కుల గజ్జి ప్రభావమే. కొన్ని కులాల్లో బాగా ఎక్కువ, కొన్ని కులాల్లో బాగా తక్కువ. ఎక్కువ గజ్జి వున్నవాళ్ళు ఎక్కువగా గోక్కోవటం వల్ల, అలా చీమూ నెత్తురూ వారి శరీరం మీద వున్న అన్ని అవయవాల మీదా కారుతున్నాయి. అదే ఈ కంపుకి కూడా కారణం. వీరిలో కొంతమందికి అర్హత వున్నా లేకపోయినా ముందు బెంచీలో కూర్చోబెడుతున్నారు అక్కడి శ్రీప్రభుత్వం వారు. అక్కడ పై అంతస్తులో కూర్చున్న వాళ్ళతో సహా ఈ కుల గజ్జి వర్గం వారు, బాధ్యతలు మరచిపోయి ఈ గోకుడు వ్యాపారంలో ముణిగిపోయారు”
“అదేమిటి వీళ్ళ తెలుగు భాష కూడా వింతగా వుంది. తెలుగు రాదా? మరి చదువూ సంధ్యలు వాళ్ళకి తీయనైన తెలుగు, మంచి సంస్కారం ఇవ్వలేదా?” అడిగింది చదువుల సరస్వతి.
“అది అంతేనమ్మా! మిగతా భాషా రాష్ట్రాలలో లేని ఈ భాషా సమస్య, ఒక్క తెలుగునాటే వుంది. తెలుగు దేశంలో తెలుగు ఎందుకు నేర్చుకోవాలీ అని ప్రశ్నిస్తున్న రోజులు ఇవి. మాతృభాషని మరచిపోయిన, మరచిపోతున్న సంస్కృతి అది. ఇక చదువులా.. ఇంతకుముందు పిల్లలు చదువుకునేవారు, ఇప్పుడు చదువులు అమ్మకానికి పెట్టాక అక్కడ చదువు కొంటున్నారు తల్లీ!” అన్నాడు నారదుడు.
భారతికి ఏమనాలో తెలియక, తల వంచుకుని ముందుకు నడిచింది.
“వాళ్లెవరు, అక్కడ గోతులు తవ్వుతున్నారు?” అడిగింది పార్వతీదేవి.
“మీకు తెలియకనా తల్లీ, నా చేత చెప్పిస్తున్నారు. సరే నాకు వీళ్ళ సంగతి కూడా తెలుసు కనుక చెబుతాను. ఆ బట్టలు చూశారుగా, ఖద్దరు బట్టలు, ధవళ వస్త్రాలు, కాషాయ పీతాంబరాలూ... ఏ సమయానికి ఆ వేషం, ఏ ఎండకి ఆ గొడుగూ పట్టే నీచులు వాళ్ళు. రాజకీయ నాయకులు. భారతదేశానికి ఇతర దేశాల నించీ విముక్తి వచ్చినా, వీరి పీడ ఇంకా వదల్లేదు. ప్రజలని నిలువుదోపిడీ చేసి, బస్తాలకు బస్తాలు డబ్బు, ఎక్కడ దొరికితే అక్కడ స్థలాలు, పెట్టెల నిండా బంగారం... అదో అంతులేని కథ అనుకోండి. అవన్నీ తీసుకుని ‘పైకి’ రావాలని బయల్దేరితే, మన యమధర్మరాజుగారు సామాన్లు తీసుకురావటానికి తన దున్నపోతు మీద ఖాళీలేదని సామాను తీసుకురావటానికి అడ్డం పడితే, ఆ దోపిడీ ధనం అంతా అక్కడే వాళ్ళ కొడుకులకీ, అల్లుళ్ళకీ, కూతుళ్ళకీ, వాళ్ళని మోసం చేసిన బాబులకీ ఇచ్చేసి, చేతులు వూపుకుంటూ వచ్చారు. వాళ్ళెవరైనా ఇక్కడకి వచ్చేటప్పుడు, ఆ బస్తాలు పెట్టెలు తెస్తారేమోనని వీళ్ళ ఆశ. అందుకే ఆ గోతులు తవ్వుకుంటున్నారు, ఏనాటికైనా ఈ సామాన్లు తెచ్చే సూత్రాలు, మార్గాలు మారతాయేమోననే ఆశతో. కొంతమంది రాజకీయ నాయకులు, ఎవరూ చూడకుండా ఎవరు తవ్వుకున్న గోతుల్లో వాళ్లనే పూడ్చి పెడుతున్నారు”
“మరి వారి వెనుక కూర్చున్న వాళ్ళు ఎవరూ.. “
“ఒకరనేముంది అంతా అదే జాతివాళ్ళు. లంచాలు తిన్న ప్రభుత్వోద్యోగులు, కల్తీలు చేసే వ్యాపారులు, భారతదేశంలోనే వుంటూ, భారతమాతని మటుమార్చాలని ప్రయత్నించే ఉగ్రవాదులు, మతాల పేరుతో వ్యాపారం చేసే అవకాశవాదులూ.. ఇలా ఒకరేమిటి.. అందరూ..”
“మరి అక్కడ ఎండిపోయిన గోతుల్లో మిగిలిన ఆ మురికి నీళ్ళు తాగటానికి వెతుకుతున్నదెవరు?”
“వాళ్ళా.. ఒక రకం ఏమిటి.. ఎన్నో రకాల నరకాసురులు. మానభంగాలు చేసి, ఆడపిల్లల్ని హత్య చేసిన వాళ్ళు, ప్రేమ పేరుతో చదువుకునే పిల్లల ముఖాల మీద రసాయన ఆమ్లాలు పోసినవారు, బూతు సినిమాలు, బొడ్డు సినిమాలు తీసి యువతని ఇలా తప్పు దారి పట్టించే మహానుభావులు, పీకల దాకా పీపాలతో మాదక ద్రవ్యాలు నింపేవాళ్ళూ, మానవత్వపు విలువలూ, సాంస్కృతిక విలువలూ, సాంఘిక విలువలూ కోల్పోయిన కొందరు ఈ తరం యువతీ యువకులూ.. అన్ని రకాల వాళ్ళూ” అన్నాడు నారదుడు.
“ఇక వెడదాం పదండి. ఇంతకుముందు స్వర్గం, నరకం అని వేరు వేరుగా వుండేవి. ఈ మరో ప్రపంచం చూస్తుంటే, ‘స్వర్గం నరకం అని వేరే వుండవు, అవి మానవ స్వయం సృష్టి మాత్రమే’ అనిపిస్తుంది. మానవ స్వభావాలనిబట్టీ, ప్రవర్తననిబట్టీ, ఈర్ష్యాసూయలనుబట్టీ, వాళ్ళే వారి జీవితాలనీ, వారి ఎదుటివారి జీవితాలనీ స్వర్గంమయం చేసుకోవటం లేదా నరకం చేసుకోవటం - అంతా వారి చేతుల్లోనే వుంటుందనిపిస్తుంది. స్వర్గం, నరకాల కోసం ‘పైకే’ రానఖ్కరలేదు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వూళ్ళోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి మతంలోనూ ఆ రెండూ వున్నాయి. వుంటాయి. అలా కాకుండా అంతా స్వర్గమే అయే రోజు వస్తుందా?” అడిగింది లక్ష్మీదేవి.
“ఎందుకు రాదు.. నా తండ్రిగారు ఇకనైనా మనుష్యుల జీవితాలు సరిగ్గా రాస్తే సరి.. “ నారదుడు అనుకోకూడదని అనుకుంటూనే, అలా అనుకున్నాడు, సరస్వతీదేవిని భయం భయంగా చూస్తూ.
అనుకుని వెంటనే నాలిక కొరుక్కున్నాడు.
అతని మనసులోని మాటని పసిగట్టిన సరస్వతీదేవి నారదుడిని చురుగ్గా చూసింది, “హన్నా.. ఎంతమాట అన్నావు. ఉండు బ్రహ్మ దేవుడికి చెబుతాను..” అని మనసులో అనుకుంటూ.
౦ ౦ ౦