(గత సంచిక తరువాయి)
ఉ. మెల్లగ లేచి కొండ దిగి, మిత్రుని యింటికి పోవగా మనం
బొల్లక, పెట్టె తెచ్చుకొను నుద్దియ చేయుట మాని, నేరుగా
పెల్లెను ’బస్సు’ నెక్కి నిజవాసము చేరితి రెండునాళ్ళలో,
ఉల్లము డిల్లగా కలచి యూచ విషాద పరీత భావనల్.
కం. నా మొగ మీక్షించిన నా
భామా పుత్ర స్నుషాది బాంధవులెల్లన్
ఏమో అయ్యెను నాకని
ప్రేమాసాదిత విషాద రేఖాననులై.
కం. పరిపరి విధముల ప్రశ్నల
కురిపించిన గాని నేను కూయాడక నే
మఱి యుండన్ గని వారలు
దురపిల్లుచు మదుల కెదియు తోచక తుదకున్.
కం. పురిలోని వైద్యశాలల,
పరదేశములోని ప్రాజ్ఞవైద్యులచేతన్,
నెరవరి నిపుణులతోడను
పరీక్ష చేయించి నూత్న పరికరములతో.
పురిలోని వైద్యశాలల,
పరదేశములోని ప్రాజ్ఞవైద్యులచేతన్,
నెరవరి నిపుణులతోడను
పరీక్ష చేయించి నూత్న పరికరములతో.
కం. మందుల మ్రింగింపించిరి,
ఎందెందో సూది మందు లెక్కించి రొగిన్,
అందందు తైల మర్దన
పొందిక చేయించినారు పూనికతోడన్.
సీ. ’అల్లోపతి’ వ్యాధులన్ని తగ్గించలే
దని ’హోమియో’ మందు తినగ జేసి,
’హోమియో’ పద్దతి హోరాటయే యని
దేశీయ వైద్యుని తెచ్చి చూపి,
ఎలమి నాయుర్వేద మిటువంటి జబ్బుకు
కానె కాదని ’యునానీ’ ని వాడి,
మానని వ్యాధికి మందిది కాదని
ప్రకృతి వైద్యంబుతో పస్తుపెట్టి,
తే.గీ. ’ఆకుపంక్చరు’ల పొడిచి, సైకియాట్రి’,
’మేగ్నటో థెరపీ’ని సమ్మిశ్రయించి,
యోగశాస్త్రంబు, మంత్ర ప్రయోగ, భూత
వైద్యముల నెన్నియో చేసి రుద్యమించి.
ఉ. ఎన్ని విధాల వైద్యముల నేపుగ చేసిననైన గాని, ఇం
కెన్ని వినూత్న మార్గముల నెన్ని ప్రశస్తములైన మందులన్
మిన్నగ మ్రింగ జేసినను, మేదురమైన మనోవిషాద మే
తెన్నున తగ్గు - వారలది తిన్న నెఱుంగ రిదేమి చోద్యమో.
తే.గీ. నేను మాత్రము నా మనోనిలయమందు
గూడు నిర్మించి దానిలో కుతిలపడుచు
స్వామి గుడిలోన జరిగిన సంఘటనలు
చింత చేయుచునుంటి నిరంతరంబు.
తే.గీ. ఎవ్వరైనను ననుజేరి హితవు చూపి
మాటలాడిన తిరిగి నే మాటలాడ,
కుఱుచ నవ్వులు నవ్వుదు కొన్ని మార్లు,
కొంటె చూపులు చూతు నింకొన్ని మార్లు.
తే.గీ. ఎవరు నా చెంత లేనిచో నెడదలోన
తలపు లెన్నియో నొకమాఱె తారసిల్లి,
మనసు చీకాకు చెందంగ కనులుమూసి
మూల్గుచుందును గట్టిగా ముక్కుతోడ.
తే.గీ. ఒక్కొక్కప్పుడు రోదింతు నోర్పు దక్కి,
క్రుంగి నాలోననే నేను గొణుగుకొందు,
వైరు లిరువురు స్పర్థతో పోరినట్లు
ఆర్చుచుందును - కాని మాటాడ నెపుడు.
తే.గీ. ఈ విధిని పది వత్సరా లేగె కాని,
పంగనామాన వజ్రాల దొంగతనము,
నంబి జంట దారుణ మరణంబు మనసు
నందు మఱువ నైతిని క్షణమైన గూడ.
మ. మును నే పల్లెకు బోనిచో గొడవలే పుట్టుండ వేమోను, ఐ
నను నే పోయితి పెండ్లి జూడ, అట ప్రత్నంబైన దేవాలయం
బున వజ్రంబులు దొంగలించబడ సమ్మూలంబు శోదించి దొం
గను గుర్తించి - నన్ను దీని కొఱకై కల్లాడు టౌచిత్యమే!
ఉ. నా చిననాటి స్నేహితుడు, నా యెడ ప్రేమ గలాడు గూడ నన్
సైచడు నంబి చోరుడను సాక్ష్యములన్ వెలిదీయ, వార లా
నీచవు నింద మూలముననే వ్యథజెంది విషాద రోష సం
కోచములన్ కృశించి పడి కూలిరటంచు దలంచు నాతడున్.
తే.గీ. వారి మరణమునకు నేనె కారణమని
నమ్మి స్నేహితు డానాడు నన్ను నిశిత
వీక్షణములు బర్పి చూచె - ఆ క్షణంబు
నుండి ఆ చూపు నా మది మండజేసె.
తే.గీ. తరచి చూడంగ నిందు నా తప్పు లేదు,
ఇది నిరూపించు కొఱకె నేనిన్ని నాళ్ళు
పగలు రేయి యోజించితి వగను మ్రగ్గి -
ఎఱుగ జేయుదు నా తర్క సరణి నిపుడు.
కం. సిరివచ్చెను పూజారికి
ఒరులెవ్వరు ఎఱుగకుండ యూరక యన్నన్,
మఱి దీని కతంబేమియొ
పరిశోధన చేయ నాకు బాధ్యత లేదే.
కం. నేరస్థుల కధికారిని,
నేరములను గుర్తెఱింగి నేర్పొప్పంగా
చోరుల పరిశోధింపక
యే రీతిని వీడువాడ నే విధినైనన్.
కం. పరిశోధనమందున పూ
జారి ననుమానించగ తగు సాక్ష్యములెన్నో
దొరుకుట, నాడే గుడిలో
నిరసించితి వాని నాంజనేయుని యెదుటన్.
తే.గీ. కాని నా స్వామి వజ్రాలు తానె తీసి,
పూజరి బ్రదుకు తెరువుకు పూని తానె
ఇచ్చినానని చెప్పెను కచ్చితముగ -
ఈ యుదంత మయోమయమాయె గాదె!
తే.గీ. పొలువ నైనట్టి నాబోటి మూఢమతికి,
ఆంజనేయుండు దర్శనంబౌటె గాక,
ఎన్నియో సంగతులు తెల్పు టెంతగానొ
వింతగా తోచు నొక్క రవ్వంత తలప!
తే.గీ. లేక ఇది మానసికమైన లీల యేమొ!
వాయుసుతుని నే నెంతయో భక్తి తనర
ఎల్లపుడు తలచువలన నుల్లమందు,
అత డటుల కనిపించి నట్లయ్యెనేమొ!
తే.గీ. కాక యొకవేళ నంబిపై కరుణతోడ,
అతనిపైన నా అభియోగ మదుపు చేసి
శిక్ష పడకుండ తప్పించు చేతమునను
నాప్రియ హితుడాడిన దొంగ నాటకంబొ!
తే.గీ. కానిచో నాటి రాత్రి నే గర్భగుడిని
చొచ్చి నట్లెట్లు తెలియును చూడకుండ,
రామనామము లోపలి ఱాళ్ళ నప్పు
డెంచి నట్లెట్లుఱుంగును హితుడు తలప!
తే.గీ. ఆ విషయము మఱ్నాడు నన్నడిగె గాదె -
అనగ నా హితు డానాటి అర్థరాత్రి
గర్భగుడిలోన నను పొంచి కాంచె ననెడు
మాట వాస్తవ మైనట్లు తేటపడదె!
తే.గీ. అంతియేగాక, మనసులో వ్యాజ మెద్ది
లేని యెడల, అతడు గుడిలోన జొచ్చి
నే నటుల అర్థరాత్రిని నెమకు చున్న
దేమని అడిగి యుండడా ప్రేమతోడ!
తే.గీ. ఎందులకు మిత్రు డీ నంబి నింత అభిమ
తించి బలవంతముగ సమర్థించుచుండె,
మిత్రునకు చౌర్యమందున పాత్ర గలదొ,
ఎంచి చూడ వీని ననుమానించ వలయు.
తే.గీ. పల్లెలో పూర్వముండిన ప్రజలు చాల
మంది కఱవు మూలాన గ్రామమును వదలి
వెళ్ళిరి, గృహములును కూలె - వీడు మాత్ర
మిచ్చటనె యుండె మేలైన మేడలోన.
తే.గీ. అదియు గాక నాడెంతయో హంగు తోడ
కూతు పెళ్ళిని జరిపించె గొప్పగాను
పట్నవాసునితో మంచి కట్న మిచ్చి,
దీని కంతకు ధనమెట్లు తెచ్చె నితడు?
తే.గీ. కనుక పూజారియు హితుడు కలిసి ఇట్టి
పథకమును వేసి యుందురు వజ్రములను
తీసి అమ్ముకొను కొఱకు తెలివిగాను,
గ్రామవాసు లెవ్వరు దీ కానకుండ!
తే.గీ. నాటి రాత్రిని నేనంత నక్కి నక్కి
గర్భగుడి జేరి రామ విగ్రహము దరిని
పీట పైకెక్కి భీతితో బిక్కు బిక్కు
మంచు, తిలకమందున ఱాళ్ళ నెంచు నపుడు.
తే.గీ. ఆంజనేయ ననుకరింప నాననమున
ఎఱ్ఱరంగు పూసి, గడపనెక్కి నిల్చి,
ఉత్కటంబైన స్వరమున హుంకరించి,
నమ్మ జేసెనా నన్ను హనుమ యనుచు!
తే.గీ. వాని ఉగ్రరూపము గాంచి, వాని మంద్ర
రవముకు జడిసి సొలపుతో భ్రాంతి చెంది
వింటినా వాడు చెప్పిన వింత కథలు,
చిత్త చాంచల్యమున మది మత్తగిల్లి.
కం. హనుమంతుని వేషంబున,
మును పూజారియెడ నాకు పొడమిన తిరమౌ
అనుమానము పోగొట్టెద
మనుకొని ఈ నాటకంబు నాడిరొ వారల్!
తే.గీ. అటుల నా అనుమానంబు నడగ జేసి
తిమని వారలనుకొనిన, ప్రమనులగుచు
వ్యథను మాని యుందురు కదా! అట్టులైన,
అర్చకుండేల చనిపోయె నతివ తోడ!
తే.గీ. అర్చకుల ఘోర మరణంబు చర్చ జేసి
నాడ సాక్ష్యశాస్త్రానుగుణంబుగాను -
ఐన రూఢిగా నిది ఆత్మహత్యయో, ప్ర
మాదమో తేల్చ లేకుంటి నాదినుండి.
తే.గీ. రాముని వీరు సత్వరము రంగగు మోక్షము కోరినట్లు, ఆ
రాముడు నట్లె యిత్తునని రాణను పల్కిన యట్లు మున్ను శ్రీ
రాముని దూతయే తెలెపె రాజిత దేవళమందు గాన ఆ
రాముని సాక్షిగా పడిరి మ్రాగి ప్రమాదవశాత్తు వారలున్.
తే.గీ. కాని దేవళమున శుభ కార్యమైన
మఱుసటి దినమ్మె వారు గోపురము నెక్కి
బొమ్మలకు రంగు దిద్దగా బోవుటేల,
ఆగరేల సద్దు మణుగు నంత దనుక!
తే.గీ. అసలు పూజారి నిర్దోషియైన - అతడె
తస్కరించె ఱాళ్ళనని తలచి పలుక
వినియెనో ఏమొ గుడిలోన భీతి తోడ -
స్వామితో నేను మాట్లాడు సమయమందు.
తే.గీ. ఈ విధముగ నా అభియోగ మెఱుకపడుట,
చేయ నట్టి నేరమునకు హేయమైన
నింద భరియింపగాలేక నీల్గినారొ -
కలగి ఆ అమాయికు లాత్మ గౌరవాన!
తే.గీ. లేక, వారలు నిజముగా లివను వజ్ర
ముల నపహరించిరే గాన తెలిసి పోయె
వారి దొంగతనము, శిక్ష పడుట ఖాయ
మనుచు నీల్గిరో సిగ్గుతో నటమటించి.
తే.గీ. లేక, హితుడె నంబిని వదలించు కొనగ,
’నీవు వజ్రాల దొంగవని వెలియయ్యె,
నింక పెద్దశిక్ష పడు’నని బెదిరించె
నేమొ! అంత దుమికి పడిరేమొ వారు.
తే.గీ. శిక్ష పడునని భయపడి చింతతోడ
ప్రాణములను తీసికొనుట వారి తప్పు -
నంబి దోషియగునని నే నమ్ము కతన,
తప్పు చేసె వాడనుట నా తప్పు కాదు.
తే.గీ. ఐన, ఇవియెల్ల విపరీతమైన యూహ
లే యగును కాని, నిజము కావేమొ తలప -
హితుడు కాని పూజారి గాని హేయమైన,
ఇట్టి పనులకు దిగజార రెప్పుడైన.
తే.గీ. పెళ్ళి తరువాత నే కనిపించకుండ,
గర్భగుడిలోన పడియుంటి గాన, రాత్రి
తిలకమున ఱాళ్ళు లెక్కించితినని మిత్రు
డూహతో నన్ను ప్రశ్నించి యుండనోపు.
తే.గీ. నాడు గుడిలోన రాముని నామమందు
వజ్రములు కొన్ని లేవని బయలు పడగ,
పూజరే దొంగయనుచు నే మొదట తలచి
పలికితిని గాదె మారుతిస్వామితోడ.
తే.గీ. హనుమ చెప్పినట్లీ వ్యవహారమందు,
అప్రమాణములైన సాక్ష్యములెగాని,
అరసి చూడ ప్రత్యక్ష సాక్ష్యములు సున్న,
అట్టి ఆధారముల నమ్మ న్యాయమగున!
తే.గీ. అటుల వారలు నిర్దోషులైన యెడల
ఎవరు తీసిరి వజ్రము లెంచి చూడ,
పావని వివరించి నటుల భక్త వరుని
కాయనే ఇచ్చెనా నంబి ఆదరువుకు!