ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రశంసించటం
హనుమంతుడు చెప్పిందంతా విని శ్రీరాముడు చాలా సంతోషంతో ఆయన్ను వానరుల సమక్షంలో ప్రశంసించాడు. హనుమంతుడు సాధించిన ఇటువంటి మహాకార్యం గరుత్మంతుడు, వాయుదేవుడూ మాత్రమే చేయగలరేమో కాని వేరెవ్వరూ ఇటువంటి పనికి పూనుకోలేరు, సాధించనూ లేరు అని హనుమంతుణ్ణి శ్రీరాముడు అభినందించాడు.

తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం హనూమతా,
న చాత్మా లఘుతాం నీత్ణ సుగ్రీవశ్చాపి తోషిత్ణ
(యుద్ధ 1.10)

ఈ హనుమంతుడు - తాను ఏ పని చేయటానికి నియమించబడ్డాడో ఆ పనిని చక్కగా నిర్వహించాడు. తన గౌరవాన్ని ఎంతమాత్రం కోల్పోలేదు. సుగ్రీవుణ్ణీ సంతోషపెట్టాడు.

'ఇంతటి ఉపకారికి నేను ఇప్పుడు ఏమి ప్రత్యుపకారం చేయగలను? ఏమి ఇవ్వగలను! ఎంత ప్రశంసించినా హనుమంతుడు చేసిన మేలుకు నా కృతజ్ఞత ఎంతమాత్రం సరిపోదు. నేను చేయగలిగిందల్లా ఇటువంటి దుష్కరకార్యం నెరవేర్చిన ఈ మహాత్ముడిని గాఢంగా పరిష్వంగం చేయటమే. అదే నా కృతజ్ఞత, అదే నా మెప్పు, అదే నా బహుమతి, అదే నా ప్రత్యుపకారం' అని హనుమంతుణ్ణి శ్రీరామచంద్రడు గాఢంగా కౌగిలించుకున్నాడు. 'హనుమంతు డెంత కార్యశాలి, ఎంత బుద్ధిమంతుడు అంటే సీతాన్వేషణకార్యమే కాక, రాక్షససంహారం వంటి ఇతరకార్యాలు కూడా చక్కబెట్టుకుని వచ్చాడు.

నన్ను, లక్ష్మణుణ్ణి, రఘువంశాన్ని కాపాడాడు. అంతేకాక సుగ్రీవుణ్ణి స్వామిభక్తిచే మెప్పించాడు' అని సీతాదేవి క్షేమవార్త తెచ్చిన మారుతిని ప్రశంసించాడు. తరువాత సుగ్రీవుడు వింటూండగా హనుమంతుడితో 'హనుమా! అపారజలాలతో నిండిన ఈ సముద్రం దాటటం ఎట్లా?' అని ఒకింత దీర్ఘాలోచనరుడనాడు శ్రీరాముడు. దిగులు ఆయనలో స్పష్టంగా పొడసూపింది. సుగ్రీవుడప్పుడు శ్రీరాముడికి ధైర్యాన్ని, స్థైర్యానిన చేకూర్చాడు. 'కృతఘ్నుడు స్నేహాన్ని పట్టించుకోనట్లు, నీవు నీ సంశయాన్ని ఎంతమాత్రం పట్టించుకోవద్దు. నీవంటి మహావీరుడు, అసమానపరాక్రముడు దైన్యంపాలు కాకూడదు. నిరుత్సాహంవల్ల కావలసిన పనులు కూడా కాకుండా పోతాయి. మన వానరసేనాపతుల పరాక్రమం సాటిలేనిది. నీటిలో, నిప్పులో, భూమిమీద, ఆకాశంలో వాళ్ళను ఎదుర్కొనేవారు లేరు. లంకాపట్టణాన్ని వానరులంతా చేరటం ఎట్లా? అని మనం ఇప్పు డాలోచించాలి కాని, తక్కిన సంశయాలు, నిరాశలూ ఏవీ వద్దు మనకిప్పుడు. వెంటనే శత్రువధోపాయమే మనం అన్వేషించవలసి ఉంది. ఇంతవరకు అనుభవించిన విషాదం చాలు. ఇప్పుడు నీవు క్రోధం పూనాలి. మనం సముద్రం దాటిపోయి లంకను చుట్టుముట్టి చీకాకుపరచడమే అవశ్యం చేయవలసిన పని' అని సుగ్రీవుడు నొక్కి చెప్పాడు.

అప్పుడు శ్రీరాముడు, సేతువు నిర్మించి లంకకు చేరే పథకం గూర్చి హనుమంతుడితో ఆలోచన చేశాడు. లంకాపట్టణం రక్షణ వ్యవస్థ గురించి, సైనికబలాలను గూర్చి అడిగాడు. అన్ని వివరాలూ సేకరించుకొని వచ్చాడు కాబట్టి లంకానగరం రక్షణవ్యవస్థను గూర్చీ బురుజులనుగూర్చీ, ప్రాకారాలను గూర్చీ, సతతం అప్రమత్తులై వాటిని కనిపెట్టుకుని కావలి కాసే బలగాలను గూర్చీ శ్రీరాముడికి విశదంగా చెప్పాడు హనుమంతుడు. ఆ యా దిక్కుల ద్వారాల వద్ద ఎందరెందరు రాక్షసులు మోహరించి ఉంటారో చెప్పాడు. అగడ్త లెన్నో, వంతెన లెన్నో వాటి వివరాలన్నీ చెప్పాడు. తాను లంకలో సైన్యాన్ని నాలుగోవంతు పరిమార్చి వచ్చానని కూడా శ్రీరాముడికి హనుమంతుడు తెలియజేశాడు. హనుమంతుడు చెప్పిన విషయాలు విని 'శత్రుదుర్భేద్యమైన నగరమే అయినా దానిని నేను నిర్మూలిస్తాను. మనం వెంటనే లంక మీద దండెత్తాలి. ఇప్పుడు గ్రహస్థితులన్నీ బాగున్నాయి. ఇది అభిజిన్ముహూర్తం. శుభప్రదమైనది. శత్రువిజయప్రదమైనది. నా కన్నీ శుభశకునాలు కనపడుతున్నాయి. అందువల్ల ఇప్పటికిప్పుడే మనం బయలుదేరాలి. కాలయాపన వద్దు' అని, ఏ సైన్యవిభాగానికి ఎవరు నాయకత్వం వహించాలో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ విషయాలన్నీ వివరంగా సుగ్రీవుడికి ఆదేశించాడు శ్రీరాముడు.

'మన సైన్యం ముందు నీలుడు ఒక లక్ష సేనావాహినితో దారితీస్తాడు. నీలుడా! స్వచ్ఛజలాలూ, తేనెలూ, పండ్లూ పుష్కలంగా దొరికే దారిలో నీ సైన్యాలు నడిపిస్తూ మాకు మార్గదర్శనం చేయాలి. ఎప్పటికప్పుడు మన వేగులవాళ్ళతో మనదారిలో శత్రువులు జలాలు విషకలుషితాలు చేయకుండా, రాక్షసులను అనుక్షణం కనిపెట్టి ఉండాలి. సుగ్రీవా! మహాబలవంతులూ, చండవిక్రములూ అయిన వానరులనే మనవెంట తీసుకొని వెళ్ళాలి. గవయుడూ, గవాక్షుడూ ఈ సైన్యానికి ముందుంటారు. ఋషభుడూ, గంధమాదనుడు కుడి ఎడమల ఈ వానరసైన్యాన్ని కాపాడుతూ సాగాలి. ఐరావతాన్ని దేవేంద్రుడు అధిరోహించి యుద్ధానికి వెళ్ళినట్లు నేను హనుమంతుణ్ణి అధిరోహిస్తాను. కుబేరుడు తన సార్వభౌమం అనే గజాన్ని ఎక్కినట్లు లక్ష్మణుడు అంగదుణ్ణి ఎక్కి వస్తాడు. మహావేగవంతుడూ, మహాబలవంతుడూ అయిన జాంబవంతుడు, వానర సేనా ప్రముఖులు సుషేణుడూ, వేగదర్శీ ఈ ముగ్గురూ సేన వెనకభాగంలో ఉండి దాన్ని సంరక్షిస్తూ సాగుతారు.'

వానరవీరుల యుద్ధయాత్ర
అప్పుడు 'రాముడు చెప్పినట్లు యుద్ధసన్నద్ధులు కావల్సింది' అని సుగ్రీవుడు అపారభల్లూక, వానరసేనాసమూహాన్ని ఆజ్ఞాపించాడు. క్షణంలో పర్వతశిఖరాలనుంచీ, గుహలనుంచీ వచ్చిన వానరయూధాలూ స్కంధావారాలుగా రూపొందాయి. యుద్ధక్రీడా పరాయణులైన వానరుల సేన అమితోత్సాహంతో కదిలింది. ఇంక ఆ రావణుడికీ, రాక్షసమూకలకూ చావు మూడినట్లే అని వానరులు ఉత్సాహంతో కేకలు పెట్టారు. నినాదాలు చేశారు. నీలుడు, ఋషభుడు, కుముదుడు ముందువరుసలో నడుస్తూ మార్గం సరిచేస్తుండగా, బలిష్ఠులైన వానరులు చాలామంది రామలక్ష్మణులకూ, వానరరాజు సుగ్రీవుడికీ చుట్టూ చేరి నడుస్తూ ఉన్నారు. శతవలి అనే మహాపరాక్రవంతుడు సమస్తసేనను పర్యవేక్షిస్తూ సాగాడు. అపారవానరసేనకు అధిపతులైన ఏసరి, పవనుడు, గజుడు, అర్కుడూ సేకు ఉభయపార్శ్వాలా రక్షణ కల్పిస్తూ సాగారు. నీలుడు సైన్యం చుట్టూ కాపలా కాస్తున్నాడు. దధిముఖుడు, రంభుడు, రభసుడు కూడా నీలుడికి అదనంగా అన్ని వైపులా పర్యవేక్షిస్తున్నారు.

అప్పు డా వానరసేన సముద్రం పొంగి పొరలినట్లు జనపదాలకు, నగరాలకు దూరంగా ఉండే మార్గాలలో ముందుకు సాగింది. భల్లూక వానర సేనలు భూమిని దద్దరిల్లచేస్తూ దారి చేసుకుంటూ పురోగమించాయి. అట్టహాసాలతో, నవ్వులతో, కేరింతలతో, భూమిమీద తోకలు తాడిస్తూ మహాసంరంభంతో ఆ సైన్యాలన్నీ సాగిపోయి సముద్రతీరం చేరాయి. ఆ మహాసముద్రం కూడా వాళ్ళకు ఒక గొప్ప యుద్ధభూమిలా అనిపించింది. వానరసైన్యఘోషతో సముద్రఘోష అణగిపోయింది. నీలుడు ఆ సైన్యాన్నంతా కనిపెట్టి చూసుకుంటూ ఉండగా మైందుడూ, ద్వివిదుడూ తమ సైన్యాన్ని నాలుగువైపులా పర్యవేక్షిస్తున్నారు.

ఈ యుద్ధసన్నాహమంతా చూస్తూ శ్రీరాముడు ''ఈ సముద్రాన్ని దాటి లంకను చుట్టుముట్టడం ఎట్లా'' అని నిర్వేదం చెందాడు. సీతను తలచుకొని ఎంతో ద్ణుఖాక్రాంతుడైనాడు. ''రావణుడు సీతను అపహరించుకొని పోతున్నప్పుడు ఆమె ఎంతగా కుమిలిపోయిందో, ఎంతగా విహ్వలురాలైందో నని స్మృతిలో మెదిలితే నేను అవశుణ్ణి అయిపోతున్నాను,'' అని లక్ష్మణుడితో చెపుతూ విలపించాడు శ్రీరాముడు.

అప్పుడు లక్ష్మణుడు ఆయనను సాంత్వన పరచాడు. ''అన్నా! ఇప్పుడు మనం సైనికవ్యూహాలు రచిస్తున్నాము. ఎందుకు ఇంక నీవు ద్ణుఖపడతావు? తారకాసురసంహారానికి దేవసేన కదలి వెళ్ళినట్లు మనం లంకను చుట్టుముట్టి రావణసంహారం చేస్తాము గదా! ఇంకా నీకు దిగు లేమీ వద్దు'' అని చెప్పాడు.

శ్రీరాముడు తన సేనతో లంకను ముట్టడించడం జరిగి తీరుతుందని తెలిసికొని రావణుడు తాను కూడా తన యుద్ధ ప్రయత్నాలలో ఉన్నాడు. హనుమంతుడి వీరవిక్రమం చూసినప్పటినుంచి రావణుడికి సిగ్గూ, భీతి కూడా కలిగాయి. సురాసురు లెవ్వరూ తేరి చూడరాని లంకాపట్టణానికి ఒక వానరమాత్రుడు రావడం, సీతతో మాట్లాడిపోవడం రావణుడికి తలకొట్టేసినంత అవమానం అనిపించింది. అప్పుడు రావణుడు తన మంరతులతో, సేనాధిపతులతో, రాజ్యప్రముఖులతో రాముణ్ణి ఎట్లా ఎదుర్కోవాలి? యుద్ధవ్యూహాలు ఎట్లా పన్నాలి? అని విస్తృతమైన ఆలోచనలు జరిపాడు.

అప్పుడు రాక్షసులు ఆ ఆలోచనలు చేయకుండా, వ్యూహరచన జోలికి పోకుండా ''సర్వలోకాలలోనూ నీ అంత ప్రసిద్ధ పరాక్రమశాలి ఎవరూ లేరు. దిక్పాలకుడైన కుబేరుణ్ణి ఓడించి పుష్పకం స్వాధీనం చేసుకున్నావు నీవు. దానవేంద్రుడు అయిన మయుడు నీకు భయపడిపోయి తన కూతురు మండోదరిని నీకిచ్చి పెళ్లిచేసి నీతో చెలిమి చేసుకున్నాడు. మధువు అనే మహారాక్షసుడు నీకు దాసోహ మనగా అతణ్ణి వశంలో ఉంచుకోవడానికి నీ చెల్లెలు ఉంభీనసను ఇచ్చి పెళ్ళి చేసి గొప్ప రాజనీతి పాటించావు. పాతాళలోకంలో పన్నగరాజులందరూ నీకు లోబడ్డారు. బ్రహ్మదేవుణ్ణే మెప్పించిన కాలకేయాది రాక్షసులతో పట్టువిడవకుండా సంవత్సరంపాటు యుద్ధం చేసి వాళ్ళను జయించావు. లోకపాలకులకే నీముందు దిక్కూదివాణమూ లేదు. నీవు యముణ్ణే లక్ష్య పెట్టలేదు. ఇక ఈ రాము డనగా ఒక లెక్కా నీకు! నీ కుమారుడు ఇంద్రజిత్తు ఒక్కడు చాలు, సమస్తవానరసేనను మట్టుపెట్టటానికి. దేవేంద్రుణ్ణి బంధించి లంకాపట్టణానికి తీసుకొని వచ్చాడు కదా నీ కుమారుడు. బ్రహ్మదేవుడి జోక్యంతో నీవు ఇంద్రుణ్ణి కరుణించావు. రాముణ్ణి కూడా ఇంద్రజిత్తు ఓటమి పాల్జేస్తాడు. రాముడు నీ చేతిలో చిక్కి తప్పించుకోలేడు'' అని స్తోత్రపాఠాలు చేశారు రావణుణ్ణి.

రాక్షసుల యుద్ధసన్నాహం
రావణుడికి ఎంతగానో ఇష్టుడైన సేనాధిపతి ప్రహస్తుడు 'మనం ఆదమరచి ఉన్నప్పుడు హనుమంతు డేవో కోతిచేష్టలు చేసి పోయినాడు. దానికి నీవు నొచ్చుకోవద్దు'' అని రావణుడికి చెప్పాడు. ఇట్లానే దుర్ముఖుడు, వజ్రదంష్ట్రుడు ప్రగల్బంగా తాము హనుమంతుణ్ణి ఒక్క ఉదుటున చంపివేస్తామనీ, రాముణ్ణీ, సుగ్రీవుణ్ణీ ఒక్కవేటున నరికివేస్తామనీ కేకలు వేశారు. రాముడికీ, భరతుడికీ విరోధం కలిగించి మన పని చక్కబెట్టుకోవాలని కొందరు మాయోపాయం బోధించారు. భరతుడే రాముడి పైకి దండెత్తుతున్నట్లు మన సేనను భరతుడిసేనలాగా కామరూపులైన రాక్షసులతో సిద్ధం చేయాలని వాళ్ళు చెప్పారు. ఆకాశాచారులైన రాక్షసులు వానరసైన్యంపై విరుచుకొని పడాలని కొందరు బోధించారు. అప్పుడు రామలక్ష్మణులు చిత్తస్థైర్యం కోలుపోయి మనకు వశులవుతారు అని సలహా చెప్పారు మరికొందరు. అప్పుడు రావణుడి కొలువులో అత్యంతప్రముఖులైన కుంభుడు, రభసుడు, సూర్యశత్రువు, మహాపార్శ్వుడు, మహోదరుడు, అగ్నికేతువు, రశ్మికేతువు వంటి క్రూరరాక్షసులు రణకండూతిని ప్రదర్శించారు. ''ఈ క్షణమే మేము వెళ్ళి శత్రువులను వధించి నీకు సంతోషం చేకూరుస్తాము'' అని అట్టహాసంగా పలికారు. అందరూ భయంకరాయుధాలు ధరించి కోలాహలం చేశారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)